
నవతెలంగాణ- రెంజల్
పొగాకునారును రాత్రి పగలు కంటికి రెప్పలా కాపాడుకుంటేనే లాభాలు వస్తాయని రెంజల్ మండలం నీల గ్రామానికి చెందిన రైతు షేక్ లతీఫ్ పేర్కొన్నారు. గత ఆరు సంవత్సరాలుగా పొగాకు నారు పై ప్రత్యేక దృష్టిని సారించి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ లాభాలను గడిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దుక్కి దున్ని చదును చేసిన తర్వాత వాటిని పెద్ద మల్లు గా తయారు చేసుకుని దానిపై సిమెంట్ పైపుతో చదును చేస్తామని, ఆ తరువాత పొగాకు విత్తనాలను ఇసుకలో కలిపి చల్లుతామని ఆయన అన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తేనే లాభదాయకంగా ఉంటుందన్నారు. గత వారం పది రోజులు ఎండలు మండిపోతూ ఉండడంతో మొక్కలు చనిపోతున్నాయి. చనిపోయిన స్థలాలలో తిరిగి విత్తనాలు చల్లుతామని ఆయన పేర్కొన్నారు. పంట చేతికి వచ్చాక తాను సుమారు 12 ఎకరాల పొగాకు పంటను వేసిన తర్వాత మిగిలిన నారును ఎకరాకి 5 వేలమొక్కలు చొప్పున మూడు వేల రూపాయలకు విక్రయిస్తానని ఆయన అన్నారు. దుక్కి దున్ని పొగాకు నారు వేసే వరకు సుమారుగా 70 వేల రూపాయల ఖర్చవుతుందని, అదనంగా ప్రతిరోజు ఏదో ఒక మందును పిచికారి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పొగాకు నారు పండించే రైతులు కొద్దిగా నిర్లక్ష్యం చేసిన పంట చేతికి రాకుండా పోతుందని ఆయన తెలిపారు. నారు మడిలో గడ్డిని తొలగించడానికి మహిళలకు రోజుకు 280 రూపాయలు ఇవ్వవలసి వస్తుందన్నారు. చీడపీడల నివారణకై వివిధ రకాల మందులను పిచికారి చేయవలసి ఉంటుందని ఆయన తెలిపారు. గతంలో వి ఎస్ టి, యాజమాన్యం విత్తనాలను సరఫరా చేసే వారనీ, ప్రస్తుతం తాము పండించిన పంటలోని ఏపుగా పెరిగిన మొక్కలను అలాగే ఉంచి వాటి నుంచి విత్తనాలను సేకరిస్తామని ఆయన అన్నారు. పొగాకు పంట చేతికి వచ్చిన తర్వాత ఎక్కువ పువ్వులు కలిగిన వాటిని అలాగే ఉంచి, వాటి ద్వారా విత్తనాలను సేకరిస్తామన్నారు. అక్కడక్కడ ఎండిపోయిన మల్లను గుర్తించి తిరిగి విత్తనాలు చల్లుతామని ఆయన పేర్కొన్నారు. పంట ఆశాజనకంగా పండినట్లయితే లక్ష నుంచి లక్ష ఇరవై వేల రూపాయల వరకు లాభం చేకూరుతుందన్నారు.
షేక్ లతీఫ్ (రైతు) నీల గ్రామం..
పొగాకు నారు పండించే సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రతిరోజు కంటికి రెప్పలా దానిని కాపాడుకుంటేనే లాభాలు వస్తాయని షేక్ లతీఫ్ పేర్కొన్నారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటకు రెండు రోజులకోమాలు స్ప్రే చేయాల్సి వస్తుందన్నారు. రెంజల్ మండలంలో సుమారుగా 5000 ఎకరాలలో పొగాకు పంట ను పండిస్తారని ఆయన పేర్కొన్నారు. కొంతమంది రైతులు ఎకరానికి 7500 మొక్కలను కూడా నాటుతారని ఆయన తెలిపారు. కష్టపడితే ఫలితం ఉంటుందన్నారు..