కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల పోరాటం

– సెప్టెంబర్‌ 2న….ఉదయం 10 గంటలకు ఇందిరాపార్కు వద్ద…మహాధర్నా : టీయుఎంహెచ్‌ఇయూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సెప్టెంబర్‌ 2న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ-సీఐటీయూ అనుబంధం) తెలిపింది. ఈ మేరకు ఆ యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్‌,రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఫసియుద్దీన్‌,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదనాయక్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 33 జిల్లాల నుంచి కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలందరూ కదిలి రావాలని వారు పిలుపునిచ్చారు. వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న రెండవ ఏఎన్‌ఎంలు, ఈసీ ఏఎన్‌ఎంలు,ఆర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌ ఏఎన్‌ఎంలు, వైద్య విధాన పరిషత్‌ ఏఎన్‌ఎంలు, హెచ్‌ఆర్డి ఏఎన్‌ఎంలు, ఇతర అన్ని రకాల ఏఎన్‌ఎంలను యధావిధిగా రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ యూనియన్‌ ఆధ్వర్యంలో 17 రోజులుగా సమ్మె జరుగుతున్నదని వారు తెలిపారు. ప్రభుత్వంతో మూడు సార్లు చర్చలు జరిగిన యధావిధిగా రెగ్యులర్‌ చేయడం గురించి ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా షోకాజ్‌ నోటీసుల పేరుతో కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇప్పటికైనా స్పందించి కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేసి సమ్మెను విరమింపజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.