చల్లారని మణిపూర్‌

– తాజా కాల్పుల్లో ముగ్గురు మృతి
ఇంఫాల్‌: మణిపూర్‌లోని హింసాత్మక పరిస్థితులు ఇంకా చల్లారటం లేదు. ఇప్పటికీ అక్కడ కాల్పుల మోతలు వినబడుతున్నాయి. అమాయకపు పౌరులు ఈ కాల్పులకు బాధితులుగా మిగులుతున్నారు. తాజాగా అక్కడ మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. అధికారులు, సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బిష్ణుపూర్‌ జిల్లాలోని ఖోయిరెంటక్‌ పర్వత ప్రాంతాల్లో, చురాచంద్‌పూర్‌ జిల్లాలోని చింగ్‌ఫీ, ఖౌసాబుంగ్‌ ప్రాంతాలలో గురువారం ఉదయం రెండు గ్రూపుల మధ్య భారీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడి మరణించారు. బుధవారం సాయంత్రం నుంచి కొన్ని గంటల ప్రశాంతత తర్వాత తాజా రౌండ్‌ కాల్పులు జరిగాయి. బుధవారం సాయంత్రం చింగ్‌ఫీ ప్రాంతంలో గాయాలైన ఐదుగురిలో ముగ్గురిని చురచంద్‌పూర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం బిష్ణుపూర్‌లోని నారాయణ్‌సేన గ్రామ సమీపంలో జరిగిన వేర్వేరు హింసాత్మక సంఘటనలలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఆరుగురు గాయపడిన విషయం విదితమే. కాంగ్‌పోక్పి, తౌబాల్‌, చురాచంద్‌పూర్‌, ఇంఫాల్‌-వెస్ట్‌ జిల్లాల్లోని సరిహద్దు, దుర్బల ప్రాంతాలలో భద్రతా దళాలు సెర్చ్‌ ఆపరేషన్‌లు నిర్వహించాయి. ఇందులో భాగంగా 5 ఆయుధాలు, 31 మందుగుండు సామగ్రి, 19 పేలుడు పదార్థాలు, 3 ఐఈడీ మెటీరియల్‌లను స్వాధీనం చేసుకున్నట్టు మణిపూర్‌ పోలీసులు ఎక్స్‌( పాత పేరు ట్విట్టర్‌)లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.