కార్యకర్తలకే సంక్షేమ పథకాలు

– అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న అధికారులు
– ప్రజల కోసం పనిచేసే వారిని ఆదరించండి
– నేటి నుంచి నిరసనలు :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆ పార్టీ కార్యకర్తలకే అందిస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో నియోజవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు, బీసీ, మైనార్టీ బంధు, గృహలక్ష్మి పథకాలను తీసుకొచ్చి.. వాటిని సొంత పార్టీ కార్యకర్తలకు ఇస్తూ నిజమైన అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు సూచించిన పేర్లను అర్హత లేకుండా అధికారులు లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదని, ఇప్పుడు కొత్త పథకాలు తీసుకొచ్చి ఎన్నికల్లో లబ్ది పొంది ఆ తర్వాత ఆ పథకాలనూ ఎత్తివేస్తారని చెప్పారు. ‘ఊరికి ఓ కోడి.. ఇంటికో ఈగ..’ అనే రీతిలో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, వాటిని ప్రజలకు వివరించేందుకు నేటి నుంచి 10వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. గ్రామగ్రామాన వాడవాడన నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో రాజకీయంగా లబ్ది పొందాలని కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ ధర తగ్గించి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయిందని తెలిపారు. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని, గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్‌, రాగిరెడ్డి మంగారెడ్డి, పరుశురాములు, వినోద్‌నాయక్‌, పాదురి శశిథర్‌రెడ్డి, ఎండీ.అంజాద్‌, పాపా నాయక్‌, పాల్వాయి రాంరెడ్డి, పిల్లుట్ల సైదులు, వాడపల్లి రమేష్‌,వెంకట్‌రెడ్డి, కరిమున్నిసా బేగం, బాబునాయక్‌, చిరుమళ్ల బిక్షం తదితరులు పాల్గొన్నారు.