సీపీఐ(ఎం) నాయకులు జూలకంటి పులీందర్‌రెడ్డి హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు

– గ్రామంలో పోలీసు బందోబస్తు
నవతెలంగాణ-మునగాల
డీవైఎఫ్‌ఐ మాజీ నాయకులు, సూర్యాపేట జిల్లా నర్సింహులగూడెం మాజీ సర్పంచ్‌ జూలకంటి పులీందర్‌ హత్య కేసులో ఎట్టకేలకు హంతకులకు శిక్ష పడింది. ఐదుగురికి కోర్టు జీవిత ఖైదు విధించింది. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్‌ నిందితులకు 14ఏండ్ల పాటు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. పులీందర్‌రెడ్డిని 2014జనవరి 30న అదే గ్రామానికి చెందిన ఆరుగురు కోదాడ సమీపంలో కత్తులు, గొడళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. కాంగ్రెస్‌కు చెందిన ఖాశీంఖాన్‌పై 370ఓట్ల మెజారిటీతో పులీందర్‌రెడ్డి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అది జీర్ణించుకోలేని ఖాశీంఖాన్‌, అతని బంధువులు హత్యకు కుట్ర పన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మద్దతు సంపాదించలేని ఖాశీంఖాన్‌ హత్యలకు తెరలేపాడు. సీసీ రోడ్ల నిర్మాణ పనుల బిల్లుల మంజూరు కోసం పీఆర్‌ఎఈని కలిసేందుకు అదే గ్రామానికి చెందిన అబ్రహంతో కలిసి పులీందర్‌రెడ్డి ద్విచక్ర వాహనంపై కోదాడ వెళ్తున్న క్రమంలో దుండగులు వెంబడించి నరికి చంపారు. 26 ఏండ్లలో గ్రామానికి చెందిన 9 మంది సీపీఐ(ఎం) నాయకులు హత్యకు గురయ్యారు. పులీందర్‌రెడ్డి హత్య కేసు ఇన్నేండ్లుగా విచారణ సాగింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం (ఎ1)ముద్దాయిగా షేక్‌ షబ్బీర్‌, ఏ-2గా కొప్పుల లక్షీనారాయణ, ఏ-3గా షేక్‌ ఇబ్రహీం, ఏ-4గా మాతంగి శ్రీను, ఏ-5గా దూళిపాల నరేందర్‌కు న్యాయమూర్తి శిక్ష విధించారు. మరో నిందితుడు జలీల్‌ గతంలో మృతిచెందాడు. గతంలో జరిగిన ఎనిమిది హత్య కేసుల్లో రాజీ కాగా.. పులీందర్‌రెడ్డి హత్య కేసులో మాత్రం నిందితులకు శిక్ష పడింది. కోర్టు తీర్పు పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం ప్రజల పక్షాన నిలిచిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో పోలీసుల పహారా..
కోర్టు తీర్పు నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుమారు 50మంది సివిల్‌ పోలీసులు, 100 మంది స్పెషల్‌ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పుతో గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని పులీందర్‌రెడ్డి భార్య జూలకంటి విజయలక్ష్మీ కోరారు.
యావజ్జీవ శిక్ష విధించటం హర్షనీయం
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చంద్రయ్య
సీపీఐ(ఎం) నాయకులు జూలకంటి పులీందర్‌రెడ్డిని హత్య చేసిన నిందితులకు కోర్టు యావజ్జీవ శిక్ష విధించడం హర్షనీయం. గతంలో గ్రామంలో పార్టీ నాయకులు ముగ్గురు హత్యకు గురైనప్పుడే హంతకులకు శిక్ష పడి వుంటే పులీందర్‌రెడ్డి హత్య జరిగి ఉండేది కాదు. సాక్షులు నికరంగా ఉండటం.. మృతుడి భార్య విజయలక్ష్మీ పోరాటం ఫలించింది. నిందితులకు శిక్షలు పడే వరకు ఆమె ధైర్యంగా నిలబడ్డారు. కోర్టు తీర్పుతో కిరాయిగూండాలకు తగిన చాస్తి జరిగింది. హత్యలో పాల్గొన్న 9 మందికి శిక్ష పడాల్సి ఉన్నప్పటికీ కోర్టు ఆరుగురికి మాత్రమే జైలుశిక్ష విధించింది. ఏదేమైనా న్యాయస్థానం సరైన తీర్పునిచ్చి ప్రజల్లో విశ్వాసం కల్పించింది.