రాజస్థాన్‌లో అమానుషం

– భార్యను వివస్త్రను చేసి ఊరేగించిన కసాయి
– భర్తసహా ఏడుగురి అరెస్టు
– బాధితురాలికి సీఎం పరామర్శ

– ప్రభుత్వ ఉద్యోగం, రూ.10లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఇస్తామని హామీ
జైపూర్‌: మణిపూర్‌లో ఇద్దరు మహిళల్ని నగంగా ఊరేగించిన ఘటన మరువకముందే రాజస్థాన్‌లో మరొక దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. ఓ గిరిజన మహిళ (21)ను ఆమె భర్తే విపరీతంగా కొట్టి, వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించాడు. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లా నిచల్‌కోటా గ్రామంలో గురువారం జరిగిన ఈ ఘటనపై వీడియో వైరల్‌ అవడంతో, భర్తసహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రతాప్‌గఢ్‌ జిల్లా ఎస్‌పి అమిత్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ కన్హా గమేటి తన భార్య అత్తింటికి రాకుండా వేరొకరితో సహజీవనం చేస్తుందంటూ ఆగ్రహంగా ఉన్నాడని చెప్పారు. ఆమెను బలవంతంగా తమ గ్రామానికి బైకుపై తీసుకొచ్చాడన్నారు. అనంతరం ఆమెను కొట్టి వివస్త్రను చేసి ఊరేగించాడన్నారు. నిందితులను అరెస్టు చేసేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో మొత్తంగా పదిమంది పేర్లు పేర్కొన్నట్లు డీజీపీ ఉమేష్‌ మిశ్రా తెలిపారు. బన్స్‌వారా రేంజ్‌ ఐజి ఆధ్వర్యాన సిట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సంఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై ప్రతాప్‌ఘడ్‌ ఎస్‌పి దర్యాప్తు చేసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారని తెలిపారు. సిఎం ఆదేశాల మేరకు ఎడిజి (క్రైమ్‌) ఎం.ఎన్‌.దినేష్‌ను ప్రతాప్‌ఘడ్‌కు పంపారు.
బాధితురాలికి సిఎం పరామర్శ
బాధిత ఆదివాసీ మహిళను రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ పరామర్శించారు. ఆమెకు సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వ ఉద్యోగమిచ్చి, రూ.10లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తామని శనివారం ప్రకటించారు. ప్రతాప్‌ఘడ్‌ వెళ్లి ఆమెను కలుసుకున్న ముఖ్యమంత్రి ఆమె భద్రతకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిట్‌ను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. బాధితురాలి కుటుంబంతో తాను స్వయంగా మాట్లాడానని, వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇది అమానవీయమైన చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. తనను బలవంతంగా మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని వెళ్లి, వివస్త్రను చేసి ఊరేగించారంటూ తన భర్తపై ఫిర్యాదు చేసిన బాధితురాలి ధైర్యాన్ని ప్రశంసించిన ముఖ్యమంత్రి ఈ కేసుపై ఫాస్ట్‌ ట్రాక్‌ విచారణ చేపట్టాల్సిందిగా ఇప్పటికే ఆదేశించారు. బాధితురాలిది చాలా పేద ఆదివాసీ కుటుంబమని, వారి పరిస్థితి చూస్తే ఆవేదన కలిగిందని అన్నారు.