సాగర్‌ నీటిని విడుదల చేయాలి

– ఎండిపోయిన పొలాలను పరిశీలించిన జూలకంటి
నవతెలంగాణ-దామరచర్ల
సాగర్‌ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపితే భూగర్భజలాలు పెరగడంతోపాటు తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం దిలావర్‌పూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో బోర్లు, బావుల కింద ఎండిపోయిన వరి పొలాలను శనివారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఆలస్యమైనా సాగర్‌ నీరు వస్తుందని, వర్షాలు వస్తాయని భావించిన ఎంతో మంది రైతులు బోర్లు, బావుల కింద వరి నాట్లు వేసినట్టు చెప్పారు. వర్షాలు పడకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లలో చుక్క నీరు లేక పైరు ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పొలాలను కాపాడుకునేందుకు వేలాది రూపాయలు అప్పులు తేచ్చి ఎన్ని బోర్లు వేసినా చుక్క నీరు పడకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నట్టు చెప్పారు. సాగర్‌ కాలువ నీరైనా వచ్చి ఆదుకుంటుందని భావించిన రైతులకు నిరాశే మిగిలిందిన్నారు. కండ్ల ముందే ఎండిపోతున్న పైర్లను చూసి రైతులు విలపిస్తున్నారన్నారు. గతంలో సాగర్‌ డ్యాంలో 505 అడుగుల నీరు ఉన్నప్పుడే ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసేవారని చెప్పారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 523 అడుగుల నీరు నిల్వ ఉన్నట్టు తెలిపారు. 15 రోజుల నుంచి నీరు విడుదల చేసి పంటలను ఆదుకోవాలని రైతులు కోరుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నీటి విడుదలకు షెడ్యూల్‌ ప్రకటించాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి ప్రత్యక్ష ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ పర్యటనలో ఆయన వెంట సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బింగ్‌ మల్లేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మాలోతు వినోద్‌, పార్టీ సీనియర్‌ నాయకులు మంగారెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీహరి రైతులు సైదులు, శేఖర్‌రెడ్డి, బిక్షం, మట్టయ్య ఉన్నారు.