– మహిళలపై న్యాయస్థానాల వ్యాఖ్యలు
– తప్పుడు ఆరోపణల కేసులు తక్కువేనంటున్న ఎస్‌సీఆర్‌బీ
– ఇప్పటికీ గృహిణులకు అదే సెక్షన్ కింద రక్షణ
న్యూఢిల్లీ: భర్త లేదా అతని తరఫు బంధువులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ కొందరు మహిళలు తప్పుడు కేసులు పెడుతున్నప్పటికీ వారికి రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ఐపీసీ 498-ఏ సెక్షన్‌కు ఉన్న ప్రాధాన్యత విస్మరించరానిది. ఇటీవలి కాలంలో ఐపీసీ సెక్షన్ 498-ఏ దుర్వినియోగంపై న్యాయస్థానాలు విచారం వ్యక్తం చేస్తూనే మహిళలకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. దీనిపై మహిళా హక్కుల కోసం పోరాడుతున్న సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు లేఖ కూడా రాశారు. సమస్యను సార్వత్రికం చేస్తూ కొందరు న్యాయ మూర్తులు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. ఐపీసీ 498-ఏ సెక్షన్‌ను ఆధారంగా చేసుకొని ఓ మహిళ దాఖలు చేసిన కేసులో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షుబేందు సామంత్ చేసిన వ్యాఖ్యలను ఇందిరా జైసింగ్ ఆ లేఖలో ప్రస్తావించారు. ఇంతకీ సామంత్ ఏమన్నారంటే…మహిళలు ఆ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తూ చట్టపరంగా అత్తింటి వారిని భయపెడుతున్నారట.
కఠిన నిబంధనలు
భార్య పట్ల అమానుష ప్రవర్తన, వర కట్న సంబంధమైన మరణాలు వంటి ఘటనలు పెరగడంతో 1983లో ఐపీసీలో 498-ఏ సెక్షన్‌ను చేర్చారు. 2005లో గృహ హింస చట్టం అమలులోకి వచ్చే వరకూ ఈ సెక్షనే మెట్టింటి వారి వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించింది. ఈ సెక్షన్ కింద కేసు పెడితే నిందితుడికి బెయిల్ లభించదు. వారెంట్ లేకుండానే పోలీసులు అరెస్ట్ చేయవచ్చు. భర్త లేదా అతని బంధువులు మహిళను వేధించినట్లు రుజువైతే మూడు సంవత్సరాల కారాగార శిక్ష పడుతుంది. వరకట్న వేధింపుల నుంచి కాకుండా అమానుష చర్యల నుండి కూడా ఈ సెక్షన్ మహిళను కాపాడుతోంది. ఇలాంటి సెక్షన్ దుర్వినియోగం కాకుండా చూడడానికి గత కొన్ని సంవత్సరాలుగా న్యాయస్థానాలు అనేక ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఈ ఆదేశాలు చట్టం యొక్క ప్రాధాన్యతను ఏ మాత్రం తగ్గించలేదు.
దుర్వినియోగంపై వ్యాఖ్యలు
సెక్షన్ 498-ఏ దుర్వినియోగంపై కొన్ని న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే… ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేయడం ద్వారా మహిళలు చట్టపరంగా మెట్టింటి వారిని భయపెడుతున్నారని కలకత్తా హైకోర్టు తెలిపింది. భర్త బంధువులు వారితో కలసి నివసించకపోయినప్పటికీ ఇలాంటి అనేక కేసులలో వారిని కూడా నిందితులుగా చేరుస్తున్నారని బాంబే హైకోర్టు ఎత్తిపొడిచింది. శారీరక హింస, వరకట్న డిమాండ్లపై భర్య చెబుతున్న మాటలలో వైరుధ్యాలు కన్పిస్తున్నాయని, భర్త కుటుంబంపై కక్ష తీర్చుకోవడానికే ఇలాంటి కేసులు పెడుతున్నారని ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోర్టు వ్యాఖ్యానించింది. ఓ కేసులో అలహాబాద్ హైకోర్ట్ ఏం చెప్పిందంటే…’ప్రతి కేసులోనూ వరకట్న వేధింపుల ఆరోపణలు చేస్తున్నారు. అనేక మంది సహజీవనానికి ఇష్టపడుతున్నారు. దీనికి ఎలాంటి చట్టబద్ధమైన కట్టుబాట్లు, ఒత్తిడులు ఉండవు’.
అనేక అవరోధాలు
మెట్టింటి వారి వేధింపులకు గురవుతున్న గృహిణులు కోర్టులో 498-ఏ సెక్షన్ కింద కేసు పెట్టడం అంత సులభమైన విషయమేమీ కాదు. ఎందుకంటే పోలీసులు ఇలాంటి కేసులను కుటుంబంలో తలెత్తిన వివాదంగానే పరిగణిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ముందే భార్యాభర్తలకు నచ్చచెప్పి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని సందర్భాలలో కుటుంబ పరువు పోతుందనో, ప్రజలలో తలవంపులు తప్పవనో భయపడి బాధిత మహిళలు కేసులను వెనక్కి తీసుకుంటున్నారు. ఒకవేళ కేసు ముందుకు సాగినా, సరైన ఆధారాలు లేక వీగిపోతోంది. ఎందుకంటే మహిళలను మానసికంగా, భావోద్వేగపరంగా హింసించినట్లు నిరూపించడం చాలా కష్టం. సామాజికంగా ఒత్తిడులు వచ్చినప్పుడు లేదా విడాకులు మంజురైన సందర్భాలలో మహిళలు విధిలేని పరిస్థితుల్లో పుట్టింటికి వెళతారు. అలాంటప్పుడు కేసును ముందుకు తీసికెళ్లడం మహిళలకు కష్టమవుతుంది. విచారణ నత్తనడక నడుస్తుంది. నిందితుడికి శిక్ష పడడం చాలా కష్టం. వీటన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమంటే చాలా మంది మహిళలకు న్యాయ పోరాటం చేయడం అంత తేలికైన విషయం కాదు. పైగా వారి ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. వాస్తవాలు ఇలా ఉంటే మహిళలు ఐపీసీ 498-ఏని దుర్వినియోగం చేస్తున్నారంటూ అభాండాలు మోపడం ఏ విధంగా చూసినా సమర్ధనీయం కాదు.
తప్పుడు కేసులు తక్కువే
జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక-2021 ప్రకారం మహిళలపై నేరాలకు సంబంధించి 4,28,278 కేసులు నమోదు కాగా వాటిలో 1,36,234 కేసులు (33%) సెక్షన్ 498-ఏకు సంబంధించినవే. వీటిలో కేవలం 6,938 మాత్రమే తప్పుడు కేసులని పోలీసుల విచారణలో తేలింది. అంటే నమోదైన కేసులలో తప్పుడు కేసులని తేలినవి చాలా తక్కువ. తాజాగా జరిపిన కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5) ప్రకారం దేశంలో 18-49 సంవత్సరాల మధ్య వయసున్న మహిళల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు భర్త చేతిలో ఏదో ఒక రూపంలో అవమానాలకు గురవుతున్నారు. వివాహిత మహిళల్లో 32% మంది భర్త నుండి వేధింపులు ఎదుర్కొంటున్నారు.