భారత ఐక్యతపై దాడి

– ‘ఒకేదేశం – ఒకే ఎన్నికలు’ పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం – ఒకేసారి ఎన్నికలు.. భారత్‌ ఐక్యతపై , రాష్ట్రాలపై దాడిగా” కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. భారత్‌ అంటే రాష్ట్రాల సమాఖ్య అని, ఒకే దేశం, ఒకే ఎన్నికలు ఆలోచన దానిపై దాడి చేయడమేనని ఎక్స్‌ (ట్విటర్‌)లో ఆదివారం పోస్ట్‌ చేశారు. ‘జమిలి ఎన్నికలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం నామమాత్రపు ప్రక్రియే. దీన్ని ఏర్పాటు చేసిన సమయంపైనా అనుమానాలు న్నాయి. దాని నియమ నిబంధనలను చూస్తే కమిటీ సిఫార్సులను ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి ఆ కమిటీలో ఉండేందుకు నిరాకరించడం సరైనదే’ అని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో భాగమయ్యేందుకు కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి నిరాకరించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గేను కమిటీ నుంచి తప్పించడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గేకు బదులుగా మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ను ప్రభుత్వం ఈ కమిటీలో చేర్చడం గమనార్హం.