10 వరకు బీజేపీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయాలనుకొనే ఆశావహుల నుంచి ఈనెల 10వ తేదీ వరకు నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తామని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి తెలిపారు. సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైందనీ, దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర కార్యాలయంలో కౌంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. మాజీ శాసనమండలి సభ్యులు రంగారెడ్డి, హైదరాబాద్‌ మాజీ డిప్యూటీ మేయర్‌ సుభాష్‌ చందర్‌ జీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేశం ఈ దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. అనంతరం వీటి స్క్రీనింగ్‌ కోసం రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేస్తామని వివరించారు. స్క్రీనింగ్‌ చేసిన జాబితాను జాతీయ కమిటీకి పంపుతామన్నారు.