– ఉప ఎన్నికల్లో దౌర్జన్యకాండ
న్యూఢిల్లీ : త్రిపురలో మంగళవారం జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ గూండాలు దౌర్జన్యకాండ సాగించారు. కొంత మంది పోలీసులు, పరిపాలన అధికారులను అడ్డం పెట్టుకుని అసాధారణ భయోత్పానక వాతావరణాన్ని సృష్టించారు. ఆదివారం బాక్సానగర్, ధన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ రెండు నియోజకవర్గాలకు పోలింగ్ రోజున దొంగ ఓట్లు వేయడం, రిగ్గింగ్ చేయడం కోసం ఈ నెల 3వ తేదీ రాత్రి నుంచే ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలను బీజేపీ గూండాలు తీసుకుని వచ్చారు. మంగళవారం రోజున వీరంతా హింసాకాండకు తెగించారు. ఈ హింసాకాండ ఎంత తీవ్ర స్థాయిలో సాగిందంటే బాక్సనగర్ నియోజకవర్గంలో కేవలం 16 మంది సీపీఐ(ఎం) ఏజెంట్లు, ధన్‌పూర్‌లో 19 మంది సీపీఐ(ఎం) ఏజెంట్లు మాత్రమే తమ తమ బూత్‌ల్లో బాధ్యతలు నిర్వహించగలిగారు. ఈ రెండు నియోజకవర్గంలో మిగిలిన అన్ని బూత్‌లలోనూ బీజేపీ గూండాలు చొరబడి సీపీఐ(ఎం) ఏజెంట్లను బలవంతంగా బయటకు గెంటేశారు. అక్రమాలకు పాల్పడ్డారు.
దొంగ ఓట్లు వేశారు. ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుల్ని కనీసం బూత్‌ల సమీపంలోకి కూడా వెళ్ల నివ్వలేదు. అనేక ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై బీజేపీ గూండాలు భౌతిక దాడులకు పాల్పడ్డారు. అధికారులు బీజేపీ గూండాలను నిలువరించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. బీజేపీ గూండాల హింసాకాండ నేపథ్యంలో రెండు నియోజకవర్గాల్లోనూ మళ్లీ కొత్తగా పోలింగ్ నిర్వహించాలని సీపీఐ(ఎం) త్రిపుర డిమాండ్ చేసింది..
మిగిలిన చోట్ల ప్రశాంతం
త్రిపుర మినహా మిగిలిన ఐదు రాష్ట్రాల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పశ్చి బెంగాల్‌లోని ధప్గురి, ఉత్తరాఖండ్‌లోని బగేశ్వరి, కేరళలోని పుతుపల్లి, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, జార్ఖండ్‌లోని దుమ్రి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. కేరళలోని పుతుపల్లి నియోజకవర్గంలో ఉమెన్ చాందీ మృతితో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉమెన్ చాందీ కుమారుడు చాందీ ఉమెన్ పోటీ చేస్తుండగా, సీపీఐ(ఎం) అభ్యర్థిగా జైక్ సి థామస్ పోటీలో ఉన్నారు. ఈ నియోజవర్గంలో సాయంత్రం 5 గంటల సమయానికి 55 శాతం ఓటింగ్ నమోదయింది.