పేదలకు వరం జీవో 58

– ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
నిరుపేదలకు వరం జీవో 58 అని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 18వ వార్డు సుందరయ్యనగర్‌లో 95 మంది పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేదకూ అందించామన్నారు. గూడు లేని వారు ఎన్నోఏండ్ల నుంచి అభద్రతాభావంతో ఉన్నారని చెప్పారు. సుందరయ్యనగర్‌ ప్రజల 20 ఏండ్ల కల ఈ రోజు నెరవేరిందన్నారు. మారో విడతలో 45 మందికి ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, కలెక్టర్‌ వెంకట్రావ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మెన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, వైస్‌చైర్మెన్‌ పుట్టా కిషోర్‌, కౌన్సిలర్‌ మాలోతు కమల చంద్రునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.