ఎస్జీటీ పోస్టులకు డీఎడ్‌ అభ్యర్థులే అర్హులు

– ఆన్‌లైన్‌లోనే డీఎస్సీ రాతపరీక్షలు : విద్యాశాఖ నిర్ణయం
– నేడో, రేపో మార్గదర్శకాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు డీఎడ్‌ అభ్యర్థులే అర్హులని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతిపాదనలను రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. ఏయే పోస్టులకు ఎవరు అర్హులు, స్థానికత వంటి అంశాలకు సంబంధించి విధివిధానాలతో కూడిన మార్గదర్శకాలు బుధవారం లేదా గురువారం విడుదలయ్యే అవకాశమున్నది. అయితే ఎస్జీటీ పోస్టులకు డీఎడ్‌ అభ్యర్థులే అర్హులంటూ ఇటీవల రాజస్థాన్‌ కేసులో సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన సమాచారాన్ని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) కూడా వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. దాని ప్రకారం ఎస్జీటీ పోస్టులకు డీఎడ్‌ అభ్యర్థులే అర్హులు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఎస్జీటీ పోస్టులకు డీఎడ్‌ అభ్యర్థులకే అవకాశం కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 5,089 ఉపాధ్యాయ, 1,523 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు కలిపి మొత్తం 6,612 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటి భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈనెల రెండో వారంలో విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తున్నది. డీఎస్సీ రాతపరీక్షలను ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. అయితే అభ్యర్థులకు ఎక్కువ సమయం కేటాయించకుండా నోటిఫికేషన్‌ విడుదలైన 45 రోజుల్లోనే రాతపరీక్షలు నిర్వహించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ టీఆర్టీ నిర్వహణకు సంబంధించి 2017 అక్టోబర్‌ పదిన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 2018, ఫిబ్రవరిలో రాతపరీక్షలను నిర్వహించింది. అంటే నాలుగు నెలలపాటు సమయం తీసుకుంది. దీనికి కారణం టీఎస్‌పీఎస్సీకి ప్రత్యేకంగా జిల్లాల వారీగా అధికారులు, సిబ్బంది లేకపోవడమే. విద్యాశాఖకు అదనపు సంచాలకులు, సంయుక్త సంచాలకులు, ఆర్జేడీలు, డీఈవోలు, ఎంఈవోలున్నారు. విద్యాశాఖ తీసుకునే ఏ నిర్ణయమైనా వెంటనే అమలు చేసేందుకు అవకాశమున్నది. అందుకే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చాక వీలైనంత తొందరగానే రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.