‘పాలేరు’ నాదే..!

Pauler is mine..!– నియోజకవర్గంలో కీలక నేతలకు తుమ్మల ఫోన్లు..!
– నేడు కాంగ్రెస్‌లో చేరిక వాయిదా
– 16 లేదా 17న చేరవచ్చని సమాచారం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బీఆర్‌ఎస్‌ నుంచి పాలేరు టిక్కెట్‌ విషయంలో భంగపడ్డ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఓడిన చోటే గెలవాలనే లక్ష్యంతో ఉన్న ఆయన పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, నియోజకవర్గ కాంగ్రెస్‌ టిక్కెట్‌ తనదేనని ఆ పార్టీకి చెందిన కీలక నేతలకు ఫోన్లు చేసి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారని సమాచారం.
పది రోజుల తర్వాత చేరిక!
మరోవైపు ఈనెల 6వ తేదీన మాజీ మంత్రి తుమ్మల కాంగ్రెస్‌లో చేరతారని అందరూ భావించారు. 7వ తేదీ నుంచి రాహుల్‌గాంధీ యూరప్‌ పర్యటన ఉన్న నేపథ్యంలో తుమ్మల ఈలోపే జాయిన్‌ అవుతారని అనుకున్నారు. కానీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరిం చుకొని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు ఈ నెల 16, 17 తేదీల్లో హైదరా బాద్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే తదితర ఏఐసీసీ నేతలు అందరూ హాజరవుతున్న దృష్ట్యా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తుమ్మల చేయందుకుంటారని సమాచారం.
ఎప్పటి నుంచో గ్రౌండ్‌వర్క్‌..
పాలేరు బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ తనకు రానిపక్షంలో ఎలాంటి వ్యూహంతో వెళ్లాలి.. వస్తే అవతలిపార్టీ నేతలను తనవైపు ఎలా తిప్పుకోవాలి.. ఇలాంటి అంశాలపై ఆయన ఎప్పటినుంచో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ నిరాకరించడానికి ముందునుంచే తన అనుచరులు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అనుచరులు పలువురితో నేలకొండపల్లి మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌ కీలక నేత ఇంట్లో తుమ్మల రహస్య సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఆ సమావేశానికి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ కీలక నేతలు ఒకరిద్దరు కూడా హాజరయినట్టు తెలుస్తోంది. హాజరైన నేతలందరూ దాదాపు తుమ్మల సామాజిక తరగతికి చెందినవారే కావడం గమనార్హం. ఈ మీటింగ్‌కు వచ్చిన కాంగ్రెస్‌ నేతల్లో ఒక్కరు.. పాలేరు టిక్కెట్‌ ఆశావహుల్లో ఉన్నారు. కాంగ్రెస్‌ టిక్కెట్‌ తనకు కాకుండా వేరొకరికి వచ్చి.. బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ తుమ్మలకు వస్తే మాత్రం తాను అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారని సమాచారం. అలాగే కందాల గ్రూపునకు చెందిన నేలకొండపల్లి, ఖమ్మంరూరల్‌, కూసుమంచి మండలాల తమ్మల సామాజిక తరగతి నేతలు కూడా ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. వారందరికీ మళ్లీ ఫోన్లు చేసి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారని సమాచారం.