– మోడీ వచ్చాక సంక్షేమ బోర్డు, పథకాల రద్దు
– సహకార వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలి
– చేనేత బంధు పథకాన్ని అమలు చేయాలి
– 22న హైదరాబాద్‌లో అఖిల భారత చేనేత సదస్సు
– చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు
– ముగిసిన తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ
– రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా వనం శాంతికుమార్, గంజి మురళీధర్ ఎన్నిక
నవతెలంగాణ- నల్గొండ కలెక్టరేట్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత రంగాన్ని పూర్తిగా విస్మరిస్తోంది.. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక చేనేత సంక్షేమ బోర్డును రద్దు చేయడమే కాకుండా సంక్షేమ పథకాలను రద్దు చేశారని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెరుపల్లి సీతారాములు అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవనంలో జరిగిన ఆ సంఘం రాష్ట్ర రెండో మహాసభలో ఆయన మాట్లాడారు. చేనేత జీవన స్థితిగతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఏంటనే విషయాలను చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత కార్మికులు కీలక పాత్ర పోషించారన్నారు. అనేక ఉద్యమాల ఫలితంగా కేంద్రంలో కొన్ని పథకాలను తెచ్చుకున్నామని, బడ్జెట్ రాబట్టుకోవడం కూడా జరిగిందని తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చేనేత సహకార సంఘాలు ఉండేవని, కేంద్ర ప్రభుత్వం సహకార వ్యవస్థను పూర్తిగా రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సహకార వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు జరపాలని, క్యాష్ క్రెడిట్ ఇవ్వాలని సహకార సంఘాల ద్వారా చేనేత మగ్గాలపై పని కల్పించి సరైన పద్ధతిలో కూలి పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితబంధు లాగానే మగ్గం నేసే ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షలు ఇస్తూ చేనేతబంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మగ్గాలకు జియో ట్యాగ్ విషయంలో పునరాలోచన చేయాలని, మగ్గం నేసే వారిని రిజిస్టర్ చేసి చేనేత బంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం చేనేతపై వేసిన జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకొని సంక్షేమ బోర్డును, పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చేనేత సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈనెల 22న హైదరాబాద్‌లో నిర్వహించే అఖిల భారత చేనేత సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభకు అధ్యక్ష వర్గంగా గంజి మురళీధర్, గుర్రం నరసింహ, కందగట్ల గణేష్ వ్యవహరించారు. మహాసభ ప్రారంభానికి ముందు చెరుపల్లి సీతారాములు జెండా ఆవిష్కరణ చేశారు.
తీర్మానాల ఆమోదం.. నూతన కార్యవర్గం ఎన్నిక
చేనేతపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని, చేనేత పెట్టుబడి సాయం కోసం దళిత బంధు తరహాలో చేనేత బంధు ప్రకటించి పది లక్షలు ఇవ్వాలని మహాసభలో తీర్మానించారు. చేనేత కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం విశాల ఐక్యవేదిక ఏర్పాటు చేసి పోరాటాలు నిర్వహించాలని ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కమిటీ
రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర అధ్యక్షులుగా వనం శాంతి కుమార్, ప్రధాన కార్యదర్శిగా గంజి మురళీధర్, కోశాధికారిగా గుండు వెంకట నర్సు, గౌరవ సలహాదారులుగా కూరపాటి రమేష్, బడుగు శంకరయ్య, ఉపాధ్యక్షులుగా గోశిక స్వామి, కూరపాటి రాములు, వనం ఉపేందర్, సహాయ కార్యదర్శులుగా గుర్రం నరసింహ, చెన్న రాజేష్, జి.భాస్కర్, మరో 13 మంది రాష్ట్ర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పాసి కంటి లక్ష్మీనరసయ్య, వర్కల చంద్రశేఖర్, చిలుకూరి లక్ష్మీనర్స్, కర్నాటి బిక్షం, నామని ప్రభా కర్, తెలంగాణ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు కుంభం కృష్ణారెడ్డి, గంజి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.