అగ్రిగోల్డ్‌ కేసులో

– చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ
– ముగ్గురు ప్రమోటర్ల పైన అభియోగాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాలు కలిపి లక్షలాది మంది డిపాజిటర్ల నెత్తిన కుచ్చుటోపి తొడిగిన అగ్రిగోల్డ్‌ కేసులో ఈడీ అధికారులు నాంపల్లి కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేశారు. అధిక మొత్తంలో వడ్డీలు చెల్లిస్తామంటూ అగ్రిగోల్డ్‌ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన డిపాజిటర్ల నుంచి వందల కోట్ల రూపాయలను సేకరించి మోసగించింది. దాదాపు 32 లక్షల మంది డిపాజిటర్ల నుంచి రూ.6 వేల కోట్లకు పైగా డిపాజిట్లను సేకరించిన ఈ సంస్థ ప్రమోటర్లు బోర్డు తిప్పేశారు. ఈ సంస్థపై వచ్చిన ఫిర్యాదుల మేరకు సీఐడీ అధికారులు కేసును నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు. కాగా, అగ్రిగోల్డ్‌ ప్రమోటర్లు మనీలాండరింగ్‌కు కూడా పాల్పడ్డారనే అభియోగంపై ఈడీ అధికారులు సైతం రంగంలోకి దిగి దర్యాప్తు నిర్వహించారు. అంతేగాక, ఈ సంస్థకు సంబంధించిన కోట్ల రూపాయల ఆస్థులను కూడా జప్తు చేశారు. అనంతరం దర్యాప్తును పూర్తి చేసిన ఈడీ అధికా రులు నాంపల్లి కోర్టులో ముగ్గురు ప్రమోటర్లు అవ్వారు వెంకట రమణ, అవ్వారు వరప్రసాద్‌, శేషగిరిరావులపై అభియోగా లను మోపుతూ చార్జిషీటును దాఖలు చేశారు.
చార్జిషీట్‌ను స్వీకరించిన కోర్టు ముగ్గురు ప్రమోటర్లను అక్టోబరు 3వ తేదీన కోర్టులో హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి.