ఉపాధ్యాయ బదిలీలకు 81,069 దరఖాస్తులు

– కొత్తగా 6,968 మంది అప్లై
– అత్యధికంగా రంగారెడ్డి నుంచి 4,722 దరఖాస్తులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు మంగళవారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 81,069 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొత్తగా 6,968 మంది ఉపాధ్యాయులున్నారు. అయితే గతంలో దరఖాస్తు చేసిన వారిలో 70,762 మంది అప్లికేషన్లను సవరించారు. 3,339 మంది దరఖాస్తులను సవరించలేదు. అయితే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 4,722 మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత నల్లగొండ నుంచి 4,416 మంది, నిజామాబాద్‌ నుంచి 4,088 మంది, సంగారెడ్డి నుంచి 4,038 మంది ఉపాధ్యాయులు అప్లై చేసిన వారిలో ఉన్నారు. బదిలీల కోసం అత్యల్పంగా ములుగు జిల్లాలో 781 మంది దరఖాస్తు చేశారు. ఒకే పాఠశాలలో సెప్టెంబర్‌ ఒకటి నాటికి కనీసం రెండేండ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసేందుకు అర్హులుగా ఉన్న విషయం తెలిసిందే. ఒకే పాఠశాలలో గెజిటెడ్‌ హెచ్‌ఎంలు ఐదేండ్లపాటు మిగతా ఉపాధ్యాయులు ఎనిమిదేండ్లు పనిచేస్తే తప్పనిసరిగా బదిలీ అవుతారు. ఉద్యోగ విరమణకు మూడేండ్లలోపు సర్వీసు ఉన్న వారికి బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది.