భారత్‌కు కాంస్యం

Bronze for India– సెమీస్‌లో చైనీస్‌ తైపీ చేతిలో ఓటమి
– టేబుల్‌ టెన్నిస్‌ ఆసియా చాంపియన్‌షిప్స్‌
పియాంగ్‌చాంగ్‌ (దక్షిణ కొరియా) : ప్రతిష్టాత్మక టేబుల్‌ టెన్నిస్‌ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత్‌ కాంస్య పతకం సాధించింది. రెండేండ్ల క్రితం దోహాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్స్‌లో మూడో స్థానంలో నిలిచి పతకం సాధించిన పురుషుల జట్టు.. తాజాగా పియాంగ్‌చాంగ్‌లో అదే ప్రదర్శన పునరావృతం చేసింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో చైనీస్‌ తైపీ చేతిలో 0-3తో పరాజయం పాలైన టీమ్‌ ఇండియా పురుషుల జట్టు.. కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మూడో సీడ్‌ భారత్‌ వరుసగా మూడు మ్యాచుల్లో రెండో సీడ్‌ చైనీస్‌ తైపీకి తలొగ్గింది. వెటరన్‌ ప్యాడ్లర్‌ అచంట శరత్‌ కమల్‌ 6-11, 6-11, 9-11తో, జ్ఞానశేఖరన్‌ సతియన్‌ 5-11, 6-11, 10-12తో, హర్మీత్‌ దేశారు 6-11, 7-11, 9-11తో వరుస మ్యాచుల్లో ఓటమి పాలయ్యారు. శరత్‌ కమల్‌, జి. సతియన్‌ చేతులెత్తేయగా.. యువ ఆటగాడు హర్మీత్‌ దేశారు ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. మహిళల జట్టు విభాగంలో క్లాసిఫికేషన్‌ మ్యాచుల్లో మనిక బత్ర బృందం నిరాశపరిచింది. థారులాండ్‌ చేతిలో 0-3తో పరాజయం పాలై ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.