– పుట్టిన రోజు నాడే విషాదం
నవతెలంగాణ-బాల్కొండ
బుడిబుడి అడుగులతో అప్పటి వరకు అలరించిన చిన్నారులు.. ప్రమాదవశాత్తు పిల్లర్ కోసం తీసిన గుంతలో పడి విగతజీవులుగా మారి కన్నవారికి కంఠశోకం మిగిల్చారు. ఇంటి నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఇత్వార్‌పేట్ గ్రామంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లిన నిశాంత్ చరణ్ (4), మెట్టు నాస్తిక్ (5) ప్రమాదవశాత్తు ఓ భవన నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడ్డారు. ఉదయం ఆడుకోవడానికి వెళ్లిన తమ పిల్లలు ఇంకా రాలేదని తల్లిదండ్రులు వెతకగా అప్పటికే గుంతలో నిర్జీవంగా నీటిపై తేలియాడుతూ కనిపించారు. నిశాంత్ చరణ్ తండ్రి శ్రీకాంత్‌కు ఇత్వార్పేట గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగం రావడంతో కొన్ని రోజుల క్రితమే చిట్టాపూర్ గ్రామం నుంచి ఇత్వార్ పేట్‌కు వచ్చారు. కాగా, గురువారం నిశాంత్ చరణ్ పుట్టినరోజు. పుట్టిన రోజు నాడే చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలతో గ్రామం అంతా విషాధ ఛాయలు అలుముకున్నాయి. 15 రోజుల కిందట గ్రామ అభివృద్ధి కమిటీ భవన నిర్మాణం కోసం గుంతలు తీసి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు బాల్కొండ ఎస్ఐ కె.గోపి తెలిపారు. కాగా, చిన్నారుల మరణవార్త తెలుసుకున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం తనను తీవ్రంగా కలిపివేసిందన్నారు. చిన్నారుల ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున వ్యక్తిగతంగా ఆర్థిక సాయం ప్రకటించారు.