ఉప ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్‌

BJP rigging in by-elections– అందుకే ఓట్ల లెక్కింపును బహిష్కరిస్తున్నాం : త్రిపురలో వామపక్ష కూటమి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
త్రిపురలోని రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ జరిగిందని, అందుకే శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపును బహిష్కరిస్తున్నట్టు సీపీఐ(ఎం)నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రకటించింది.తాజా నివేదికల ప్రకారం, మంగళవారం జరిగిన బోక్సానగర్‌, ధన్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వరుసగా 89.2 శాతం, 83.92 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు.త్రిపుర లెఫ్ట్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ నారాయణ్‌ కర్‌ మాట్లాడుతూ ఉప ఎన్నికలు ”పూర్తిగా రిగ్గింగ్‌ చేయడానికి ప్రహసనంగా తయారయ్యాయి” అని విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరు పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ”.. ఈ విషయంపై మేం పోలింగ్‌ ప్రారంభం నుంచి ఎన్నికల సంఘం దృష్టికి పదే పదే తీసుకెళ్లాం. కానీ పెద్ద ఎత్తున జరిగిన రిగ్గింగ్‌ను నిరోధించేందుకు ఎలాంటి సానుకూల చర్యలు తీసుకోకపోవడం విచారకరం. ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో జరిగిన రిగ్గింగ్‌ ఎన్నికలను ఉపసంహరించుకుని తాజాగా ఎన్నికలను ప్రకటించాలని త్రిపుర లెఫ్ట్‌ ఫ్రంట్‌ డిమాండ్‌ చేస్తోంది. అయితే ఆశ్చర్యకరంగా 24 గంటలు గడిచినా ఇంకా ఎన్నికల సంఘం కదలలేదు. ఎన్నికల సంఘం ఉద్దేశం స్పష్టంగా ఉంది” అని విమర్శించారు.బెదిరింపులు, హింసకు సంబంధించిన ముందే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యాన్ని వామపక్ష కూటమి కోరింది. బోక్సానగర్‌ స్థానం నుంచి సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సంసుల్‌ హక్‌ మరణం, ధన్‌పూర్‌ నుంచి బీజేపీ టిక్కెట్‌తో పోటీ చేసి గెలుపొందిన కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమా భూమిక్‌ రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కాంగ్రెస్‌, టిప్రా మోతా రెండూ ఈ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నాయి. ఈసారి రంగంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష సీపీఐ(ఎం) మాత్రమే ప్రధాన పోటీదారుగా ఉన్నాయి. బాక్సానగర్‌లో సీపీఐ(ఎం) అభ్యర్థి మిజాన్‌ హుస్సేన్‌పై బీజేపీ అభ్యర్థి తఫజ్జల్‌ హుస్సేన్‌ పోటీ చేశారు. ధన్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి బిందు దేబ్‌నాథ్‌, సీపీఐ(ఎం) అభ్యర్థి కౌశిక్‌ దేబ్‌నాథ్‌ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు.