టీచర్లకూ ఫేషియల్‌ రికగ్నిషన్‌ హాజరు

–  వారంరోజుల్లో విద్యార్థులకు అమలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్న ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఫేషియల్‌ రికగ్నిషన్‌ హాజరు విధానం (ఎఫ్‌ఆర్‌ఏఎస్‌) అమలు కానుంది. పైలట్‌ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌లో ఇప్పటికే అమలవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని వారం రోజుల్లో అమల్లోకి తేవాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నది. ఆ తర్వాత ఉపాధ్యాయులకూ వర్తింపచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘డీఎస్‌ఈ ఎఫ్‌ఆర్‌ఎస్‌’ యాప్‌ను రూపకల్పన చేశారు. దీన్ని అమలు చేసే పనిలో విద్యాశాఖ అధికారులు నిమగమయ్యారు. అయితే తొలుత ప్రభుత్వ, పంచాయతీరాజ్‌, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లు, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లోని విద్యార్థులందరికీ ఫేషియల్‌ రికగ్నిషన్‌ హాజరు విధానాన్ని అమలు చేస్తారు. ఆ తర్వాత ఉపాధ్యాయులకూ వర్తింపచేస్తారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు వినియోగించే మొబైల్‌ ఫోన్లలో ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల వివరాలను వారి ముఖం ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేయాలి. దాని ఆధారంగా ప్రతిరోజూ హాజరును విద్యాశాఖకు పంపించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 26,040 ప్రభుత్వ పాఠశాలల్లో 21,50,626 మంది విద్యార్థులు చదువుతున్నారు. 1,07,259 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.