భారత్‌,పాక్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే

Reserve day for India and Pakistan match– ఏసీసీ, పీసీబీ సంచలన నిర్ణయం
– వాణిజ్య విలువలకు ప్రాధాన్యత
వరుణుడు.. ప్రపంచ క్రికెట్‌ ఇటీవల ఎదుర్కొంటున్న అతి పెద్ద వాతావరణ సమస్య!. సాంకేతికత అందుబాటులోకి వచ్చినా.. వర్షం ప్రమాదం నుంచి తప్పించుకునే మార్గం ప్రపంచ క్రికెట్‌కు కనిపించటం లేదు. వరుణుడు మ్యాచులను వర్షార్పణం చేస్తూనే.. క్రికెట్‌ బోర్డుల నడుమ చిచ్చుకు కారణమవుతున్నాడు!. ఆసియా కప్‌లో రూ.వేల కోట్ల వాణిజ్య విలువలతో కూడిన భారత్‌, పాకిస్థాన్‌ సూపర్‌ 4 మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ప్రకటించటంతో.. ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
నవతెలంగాణ-కొలంబో
కాదేది కార్పోరేట్‌ లాబీకి అతీతం!. ఆసియా కప్‌లో ఉన్నపళంగా ‘ప్లేయింగ్‌ కండిషన్స్‌’ మార్పుతో ఇది మరోసారి రుజువైంది. సాధారణంగా, ఓ టోర్నీలో ప్లేయింగ్‌ కండిషన్స్‌ను ఆరంభంలోనే నిర్ణయిస్తారు. టోర్నీ ఆరంభం అనంతరం అందులో ఎటువంటి మార్పులు ఉండవు. కరోనా మహమ్మారి పరిస్థితుల్లో ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో అనివార్య మార్పు అవసరమైనా.. అన్ని జట్లకు సమ న్యాయం జరిగేలా మార్పులు చేశారు. కానీ తాజాగా ఆసియా కప్‌ సూపర్‌ 4 మ్యాచుల్లో కేవలం భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్‌ డే కేటాయించారు. దీంతో బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్ల కోచ్‌లు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసియా కప్‌లో ఓ దశ ముగిసిన అనంతరం.. ప్లేయింగ్‌ కండిషన్స్‌ మార్పు చేయటం.. అది కూడా ఓ మ్యాచ్‌కే పరిమితం చేయటం పట్ల క్రికెట్‌ పండితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఏసీసీ, పీసీబీ లొల్లి : ఆసియా కప్‌ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డువి. హైబ్రిడ్‌ మోడల్‌లో పీసీబీ టోర్నీని నిర్వహిస్తుంది. ఆసియా కప్‌లో కీలక సూపర్‌ 4 మ్యాచులు మొదలయ్యాయి. అయితే, సూపర్‌ 4 మ్యాచుల వేదిక కొలంబోలో భారీ వర్షం సూచనలు ఉన్నాయి. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఆదివారం జరుగనుండగా.. ఆ రోజు సుమారు 90 శాతం వర్షం కురువనుందని వాతావారణ శాఖ తెలిపింది. దీంతో భారత్‌, పాకిస్థాన్‌ సూపర్‌ 4 మ్యాచ్‌ను కొలంబో నుంచి హంబన్‌టొటెలోని మహీంద రాజపక్స అంతర్జాతీయ స్టేడియానికి మార్పు చేస్తూ పీసీబీ ఓ ప్రకటన చేసింది. దీనిపై మండిపడిన ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌.. వేదిక మార్పును వ్యతిరేకించింది. దీంతో భారత్‌, పాక్‌ మ్యాచ్‌ కొలంబోలోనే కొనసాగుతుందని పీసీబీ వెల్లడించింది. గ్రూప్‌ దశలో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ వర్షార్పణం కావటంతో ప్రసారదారు స్టార్‌ ఇండియాకు తీవ్ర నష్టం వాటిల్లందని సమాచారం. దీంతో వేదిక మార్పును తొలుత ప్రసారదారే కోరినట్టు తెలిసింది. వేదిక మార్పునకు అంగీకారం తెలపని ఏసీసీ.. అందుకు భిన్నంగా భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డేను కేటాయించింది. దీంతో భారత్‌, పాక్‌ మ్యాచ్‌ ఆది, సోమ వారాల్లో జరుగుతుంది.
తొలుత ఫైనల్‌కు మాత్రమే : ఆసియా కప్‌లో తొలుత ఫైనల్‌ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్‌ డే కేటాయించారు. సెప్టెంబర్‌ 17న కొలంబోలో ఫైనల్‌ జరుగుతుంది. సెప్టెంబర్‌ 18 రిజర్వ్‌ డే. క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి నాకౌట్‌ కాని మ్యాచ్‌కు రిజర్వ్‌ డే కేటాయించారు. భారత్‌, పాక్‌ మ్యాచ్‌కు ఇప్పుడు ఫైనల్‌ మ్యాచ్‌ నిబంధనలు వర్తిస్తాయి. ఆదివారం వర్షం అంతరాయం కలిగించినా.. కుదించిన ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేందుకు తొలుత ఫీల్డ్‌ అంపైర్లు ప్రయత్నిస్తారు. ఆదివారం వర్షం ఆటకు వీలు లేకుండా చేసి.. మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వెళితే అప్పుడు ఓవర్లలో ఎటువంటి కోత ఉండదు. పూర్తి 50 ఓవర్ల ఇన్నింగ్స్‌లు ఉంటాయి. రెండో రోజు సైతం వర్షం కురిస్తే అప్పుడు మళ్లీ సమయానుకూలంగా ఓవర్లలో కోత విధించి ఫలితం తేలేలా చూస్తారు.
బంగ్లా, లంక కోచ్‌ల ఫైర్‌! : భారత్‌, పాకిస్థాన్‌ సూపర్‌4 మ్యాచ్‌కు రిజర్వ్‌ డే కేటాయింపుపై బంగ్లాదేశ్‌ కోచ్‌ చండిక హతురసింఘె, శ్రీలంక కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌లు తప్పుపట్టారు. ‘టోర్నీ మధ్యలో నిబంధనలు మార్చుతూ నిర్ణయాలు తీసుకునే పరిస్థితులను నేను ఏ టోర్నీలోనూ చూడలేదు. ఆసియా కప్‌ టెక్నికల్‌ కమిటీలో అన్ని దేశాల సభ్యులు ఉంటారు. అయినా, మరేదో కారణంతో ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. వర్షం ప్రభావిత మ్యాచులకు రిజర్వ్‌ డే ఉండటం మంచిదే. కానీ అది ఒక్క మ్యాచ్‌కే ఎలా పరిమితం చేస్తారు. దీనిపై ఇప్పుడు స్పందించడానికి ఏమీ లేదు. నిర్ణయం తీసుకునే ముందు అభిప్రాయాలు చెప్పటం వేరు. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇక మాట్లాడానికి ఏముంటుంది?’ అని చండిక హతురసింఘె అన్నారు. ‘ ఈ నిర్ణయం వినగానే తొలుత కాస్త ఆశ్చర్యానికి గురయ్యాను. కానీ టోర్నీని మేము నిర్వహించటం లేదు. కాబట్టి మేము పెద్దగా చేసేదేమీ లేదు. రిజర్వ్‌ డే రూల్‌తో ఓ జట్టుకు పాయింట్లు లభించి.. రిజర్వ్‌ డే లేకపోవటం వల్ల మరో జట్టు పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుంది. అదే ప్రధాన సమస్య. ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు. పరిస్థితులకు తగినట్టుగా మెరుగ్గా సిద్ధమవ్వటం ఒక్కటే మార్గం’ అని క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ తెలిపాడు.