– విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు
హైదరాబాద్ : వినాయక విగ్రహాల నిమజ్జనం వ్యవహారంపై గతేడాది ఇచ్చిన ఉత్తర్వులనే ఈ ఏడాది కూడా అమలు చేయాలని ప్రభుత్వానికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిట్ (పీవోపీ)తో చేసిన విగ్రహాలను హుస్సేన్‌సాగర్, చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయరాదని చెప్పింది. పీవోపీ విగ్రహాలను తాత్కాలిక నీటి కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని సూచించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ శుక్రవారం ఆదేశించింది. గత మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని గుర్తు చేసింది. వాటిని ఎత్తేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. గత మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించారని, గత ఏడాది హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేశారని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. విగ్రహాల నిమజ్జన వ్యవహారంపై కొత్తగా తయారు చేసిన నిబంధనలను ప్రభుత్వం సమర్ధించింది. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది.
ఎస్వీభట్టిని సత్కరించిన బార్ అసోసియేషన్
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఎస్వీ భట్టిని హైకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం సత్కరించింది. కార్యక్రమంలో హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరధే, ఇతర న్యాయమూర్తులు, ఏజీ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మెన్ నర్సింహారెడ్డి పీపీ రాజేందర్‌రెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు పాల్గొన్నారు.