న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి అప్రూవర్‌గా మారారు. శుక్రవారం సాయంత్రం అప్రూవర్‌గా మారిన ఎంపీ, ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులకు కీలక సమాచారం అందించారు. అయితే.. ఇప్పటి వరకూ అప్రూవర్‌గా మారిన వారిలో ఎక్కువ మంది సౌత్ గ్రూప్‌నకు సంబంధించిన వారే కావడం గమనార్హం.
ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న ఇండో స్పిరిట్ కంపెనీలో కీలక భాగస్వామ్యం మాగుంటదే. అయితే.. అప్రూవర్‌గా మారిన మాగంటి ఈడీకి ఏమేం సమాచారం ఇచ్చారు..? ఎవరెవరి గురించి చెప్పారు..? అని సౌత్‌గ్రూప్ సభ్యులు, ఈ కేసులో ఆరోపణలు, విచారణలు ఎదుర్కొన్న వ్యక్తుల్లో టెన్షన్ మొదదలైంది. కాగా.. ఇప్పటికే ఈ కేసులో ఎంపీ కుమారుడు రాఘవ రెడ్డి అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు శరత్ చంద్రారెడ్డి రెడ్డి కూడా అప్రూవర్‌గా మారారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ బెయిల్‌పైన బయటికొచ్చి ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి, రాఘవ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు ఇచ్చిన సమాచారం ఆధారంగా అనేక మందిని ఈడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీలపై ప్రధానంగా ఈడీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.