2వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలి

2nd PRC should be announced soon– సమాన పనికి సమానవేతనమివ్వాలి
– ఉద్యోగుల భద్రత కల్పించాలి
– సీఎస్‌కు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేసింది. వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరింది. ఉద్యోగ భద్రత కల్పించాలని సూచించింది. రెండో పీఆర్సీని ప్రకటించాలని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారిని శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జె వెంకటేశ్‌ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 40 శాఖల్లో సుమారు 1.40 లక్షల మంది పనిచేస్తున్నారని తెలిపారు. జులై నుంచి ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికీ కొత్త వేతనాలను అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతోపాటు విశ్వవిద్యాలయాలు, వైద్యారోగ్య, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ, కేంద్ర, రాష్ట్ర పథకాల్లో ఉన్న సిబ్బందితో సహా వివిధ శాఖల్లో ఏజెన్సీలు నియమాకం చేసిన ఉద్యోగులతో సహా అందర్నీ పీఆర్సీ జీవో పరిధిలోకి తేవాలని డిమాండ్‌ చేశారు. సుమారు 200 మంది రెన్యువల్స్‌ చేయని పాలిటెక్నిక్‌ బోధనేతర సిబ్బంది సమస్యను పరిష్కరించాలనీ, తొలగించిన 23 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనంతోపాటు డీఎ, హెచ్‌ఆర్‌ఏ వర్తింప చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాలు, గ్రంథాలయాలు, మున్సిపాల్టీలు, గ్రామపంచాయతీల్లోనూ పీఆర్సీ జీవోలు అమలయ్యేలా ఆదేశాలివ్వాలని తెలిపారు. ప్రతినెలా మొదటివారంలో జీతాలను చెల్లించాలని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న వేతన బకా యిలను తక్షణం విడుదల చేయాలని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల దీర్ఘకాలిక సర్వీసును పరిగణనలోకి తీసుకుని రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. ఈలోపు సుప్రీంకోర్టు తీర్పుననుసరించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని పేర్కొన్నారు.