ఈసీ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు

In EC decisions
Courts can intervene–  రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు అన్యాయం జరిగితే కోర్టులు చూస్తూ ఊరుకోవు
–  రాజకీయ పార్టీలన్నింటికి సమాన అవకాశాలు కల్పించకపోతే ఎన్నికలు న్యాయంగా జరగవు : సుప్రీం కోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ : ఎన్నికల కమిషన్‌ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చునని సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషన్‌ నిర్ణయాల వల్ల రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు అన్యాయం జరిగితే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోలేవని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలన్నింటికి సమాన అవకాశాలు కల్పించకపోతే ఎన్నికలు న్యాయంగా ఎలా జరుగుతాయని ప్రశ్నించింది. లడాక్‌లో జేకేఎన్‌సీ పార్టీకి ‘నాగలి’ గుర్తును కేటాయించడానికి ఎన్నికల కమిషన్‌ నిరాకరించింది. దీంతో ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ జేకేఎన్‌సీ పార్టీ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ అహ్సానుద్దీన్‌ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది. ఎన్నికల జాప్యాన్ని నివారించడానికి మాత్రమే ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలను కోర్టులు పట్టించుకోవని ధర్మాసనం తెలిపింది. లెవెల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ కల్పించకపోతే ఖచ్చితంగా కోర్టులు జోక్యం చేసుకుంటాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.