హైదరాబాద్‌లో భారీ వర్షం రోడ్లన్నీ జలమయం

Heavy rain in Hyderabad All the roads are flooded– అధికారులను అప్రమత్తం చేసిన మేయర్‌
–  మ్యాన్‌హోల్స్‌ తెరవొద్దని ప్రజలకు సూచన
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో శనివారం మరోసారి భారీ వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, బోరబండ, మోతినగర్‌, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, నాగోల్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కేపీహెచ్బీ, కూకట్‌ పల్లి, మదాపూర్‌, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీలో వర్షం కురిసింది. రోడ్ల పైకి నీరు రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దాంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు.
వర్షాల నేపథ్యంలో మేయర్‌ గద్వాల్‌ విజయ లక్ష్మి జీహెచ్‌ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. శనివారం టెలీకాన్ఫరెన్స్‌లో జోనల్‌ కమిషనర్‌లతో మాట్లాడారు. కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, శేరిలింగంపల్లి, చందానగర్‌, మాదాపూర్‌, చార్మీనార్‌, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల్లో కాలనీలు, రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగరంలో మ్యాన్‌ హౌల్‌, క్యాచ్‌ పిట్‌ కవర్లను తెరువొద్దని నగర వాసులకు సూచించారు.
వరదలు వచ్చి రోడ్డుపై నీరు నిలిచినప్పుడు మాన్‌ హౌల్స్‌ మూతలు తెరిచి ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అనధికార వ్యక్తులు మాన్‌ హౌల్స్‌ మూతలను తెరిచినా, తొలగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది మ్యాన్‌ హౌల్స్‌ క్యాచ్‌ ఫిట్స్‌ మూతలు ఓపెన్‌ చేసి దానిని క్లీన్‌ చేసి మళ్లీ మూసేస్తారని, ప్రయివేటు వ్యక్తులు ఓపెన్‌ చేసి వదిలి వేయడం వల్ల తెలియనివారు మాన్‌ హౌల్స్‌లో పడిపోయి ప్రాణం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వరద నీటి సమస్యలు ఉంటే జీహెచ్‌ఎంసీ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 040- 2111 111లో సమాచారమివ్వాలన్నారు.