ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే…భట్టి పీపుల్స్‌మార్చ్‌

Bhatti People's March to know the sufferings of the people– పుస్తకావిష్కరణ సభలో మాణిక్‌రావు ఠాక్రే
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేదలతోపాటు అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర చేపట్టారని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే చెప్పారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన ఆయన…వారి సమస్యలు చూసి చలించిపోయారని వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే వాటిని ఎలా పరిష్కరిస్తుందో ప్రజలకు వివరించి ఒక భరోసా కల్పించారని తెలిపారు.
బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టారని కొనియాడారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో తిరుమలగిరి సురేందర్‌ రచించిన ‘మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర డైరీ’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు, చిన్నారెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్‌, మాజీ పార్లమెంటు సభ్యులు సిరిసిల్ల రాజయ్య, ఖైరతాబాద్‌, రంగారెడ్డి డిసిసి అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి, రోహిన్‌ రెడ్డి తదితర కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఠాక్రే మాట్లాడుతూ మండు టెండలను సైతం లెక్కచేయకుండా 110 రోజులపాటు ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశారని తెలిపారు. భట్టి విక్రమార్క చేపట్టిన సాహసోపేతమైన పాదయాత్ర తెలంగాణలో ఇంతకు ముందు ఏ రాజకీయ పార్టీ నాయకులు చేయలేదన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏఐసీసీ ఆదేశాల మేరకు సీఎల్పీ నేతగా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేశానని తెలిపారు.
నేను పాదయాత్ర చేసినప్పటికీ అంతా తానై నన్ను నడిపించింది ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి అని గుర్తు చేశారు. పాదయాత్ర విజయ వంతం కోసం ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్‌ బాబు, మాజీ ఎంపీ వి హను మంతరావు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌ రావు వివిధ జిల్లాలో ఉన్న కాంగ్రెస్‌ నాయకుల తో తన ఆలోచనలను పంచుకొం టూ సమన్వయం చేశారని వివరిం చారు. పాదయాత్ర కు పీపుల్స్‌ మార్చ్‌ అని నామ కరణం చేసింది ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ అని గుర్తు చేశారు.ఈ సందర్భంగా గద్దర్‌ అన్నకు నివాళులర్పించారు.