మంగుళూరులో రెచ్చిపోయిన కాషాయ మూకలు

– ‘రంగ్‌ బర్సే’ వేదికపై దాడి … ఆరుగురి అరెస్టు
బెంగళూరు : బీజేపీ పాలిత కర్నాటకలో కాషాయ మూకలు మరోమారు రెచ్చిపోయాయి. మంగుళూరులో ‘రంగ్‌ బర్సే’ పేరుతో నిర్వహించాల్సిన ఒక సాంస్కృతిక కార్యాక్రమాన్ని భౌతిక దాడులతో హిందూత్వ గూండాలు అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వేదికను ధ్వంసం చేశారు. ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురు భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..మంగళూ రులోని మరోళిలో ‘రంగ్‌బర్సే’ పేరుతో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఒక వినోద కార్యక్రమం నిర్వహించాల్సివుండేది. అయితే కొంచెం ఆలస్యం గా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ కార్యక్రమం ప్రారంభమయింది. ఆ కొద్ది సేపటికే భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు వేదికపై దూసుకొచ్చారు. నిర్వాహకులతో వాదనకు దిగారు. ‘ఇలాంటి కార్యక్ర మాన్ని అనుమతించం’ అంటూ రెచ్చిపోయారు. వేదికను ధ్వంసం చేశారు. ‘రంగ్‌ బర్సే’ ప్రచార పోస్టర్లు, ఫ్లెక్సీలను చింపివేశారు. కార్యాక్రమాన్ని జరగనీయకుండా అడ్డుకున్నారు. భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు సాగించిన ఈ విధ్వంసానికి సంబంధి ంచిన వీడియాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. భజరంగ్‌ దళ్‌ దాడిపై నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కంకనాడి టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీస్‌ కమిషనర్‌ కులదీప్‌ కుమార్‌ ఆర్‌ జైన్‌ తెలిపారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ‘రంగ్‌ బర్సే’ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.