– బాజాప్త అభివృద్ధి చేసుకుంటాం
– రేవంత్ వ్యాఖ్యలకు మంత్రి హరీశ్‌రావు కౌంటర్..
– ఈనెల 15న సిద్దిపేటకు బుల్లెట్ స్పీడ్‌లో రానున్న రైలు
– అభివృద్ధిని చూసి కొందరు ఓరుస్తలేరు..
– విద్యాలయాలకు ఆలయం సిద్దిపేట : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-సిద్దిపేట/ చిన్నకోడూరు
‘సిద్దిపేట నుంచే పెద్ద ఎత్తున ఉద్యమం చేసినం.. బాజాప్త అభివృద్ధి చేసుకుంటాం.. మీ సమైక్య పాలనలో ఈ ప్రాంతం గోస పడ్డది. 60 ఏండ్ల ప్రతిపక్షాల కాలంలో లేని అభివృద్ధి.. ఈ తొమ్మిదేండ్లలో ఎలా జరిగింది.. తెలంగాణ ఉద్యమ గడ్డ.. సిద్దిపేట ప్రజలు రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఉద్యమించారు..’ అంటూ సిద్దిపేట, గజ్వేల్‌లోనే అభివృద్ధి జరిగిందన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో సోమవారం పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు పత్రాలు, ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ఇన్సూరెన్స్ పత్రాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 15న బుల్లెట్ స్పీడ్‌తో సిద్దిపేటకు రైలు రాబోతున్నదన్నారు. సిద్దిపేట ప్రజలు ఎక్కడికి వెళ్లినా వారి గౌరవం, ప్రతిష్ట పెంచామని తెలిపారు. సిద్దిపేట అభివృద్ధి చూసి ఓరుస్తలేరని, సిద్దిపేట ప్రజలు గొప్ప చైతన్యవంతులని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేస్తుండటంతో ప్రయివేటు పాఠశాల యాజమాన్యాలకు, బోధన చేసే సిబ్బందికి కొంత ఇబ్బంది కలుగుతుందన్నారు. అయినప్పటికీ సమాజంలో 50 శాతం మంది విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్నారని, రాష్ట్ర అభివృద్ధిలో 50 శాతం వారి భాగస్వామ్యం ఉందన్నారు.
విద్యాలయాలకు ఆలయం సిద్దిపేట : మంత్రులు హరీశ్‌రావు, సబిత
వైద్య, వ్యవసాయ, పశువైద్య, ఫార్మసీ, నర్సింగ్ కళాశాలలతో పాటు అన్నిరకాల విద్యను అభ్యసించడానికి సిద్దిపేటలో కళాశాలలు ఉన్నాయని, విద్యాలయాలకు ఆలయంగా సిద్దిపేట మారిందని మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చిన్నకోడూరు మండలంలోని రామంచ శివారులో నూతనంగా నిర్మించిన రంగనాయక స్వామి బీ ఫార్మసీ కళాశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి, రాష్ట్రానికి సిద్దిపేట రోల్ మోడల్ అని తెలిపారు. స్వల్పకాలంలో కళాశాల నిర్మించి విద్యా సంవత్సరం ప్రారంభించిన ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు మారుమూలన ఉన్న పల్లెటూర్లు కూడా సమానంగా అభివద్ధి చెందుతున్నాయన్నారు. కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకష్ణ శర్మ, ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మెన్ శంకర్, చిన్నకోడూరు ఎంపీపి కూర మాణిక్య రెడ్డి, రామంచ సర్పంచ్ సంతోషవిక్రమ్, ప్రజా ప్రతినిధులు, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.