గట్టుకు మొరిగిన కుక్క గూత ఎల్లక సచ్చిందట

మాట్లాడితే, చెప్పితే, అరిస్తే, లొల్లి చేస్తే అవతలి పక్కన ఆలకించే వాళ్లు ఉండాలి. అట్ల లేక పోతే ఎంత మొత్తుకున్నా ఉత్తదే అయితది. కుక్క ఇంటికాడ ఉంటది. ఇంటికి ఎవరన్నా వస్తే మొరగడం దాని లక్షణం. గట్టుకు మొరిగిన కుక్క ప్రయోజనం లేదు. ఈ సందర్భంలోనే ‘గట్టుకు మొరిగిన కుక్క గూత ఎల్లక సచ్చిందట’ అంటరు. గట్టు గుట్ట లాంటిది. గూత అంటే అరుపు. కుక్క గట్టును చూస్తూ అదే పనిగా మొరిగి ఆఖరుకు చనిపోయిందన్నట్టు. ఇంకో సామెత ‘గుట్టకు కట్టెలు మోసినట్లు’ అని అంటరు. అసలు కట్టెలు అంటే వంట చెరుకు తెచ్చుకునేదే గుట్టనుంచి. అలాంటిది గుట్టకు కట్టెల మోపు కట్టుకుని పోవుడు పద్దతితో వ్యవహరించే వాల్లను ఇట్లా ఒక్క సామెతలోనే వివరిస్తారు. అట్లనే మరొక సామెత గుర్తుకు వస్తది. ‘పేనుకు పెత్తనం ఇస్తే నెత్తి అంతా గొరిగిందట’ అంటరు. పెత్తనం అంటే అధికారం. నాయకత్వం ఇస్తే పేను నెత్తి అంతా గొరిగింది అనే అర్థంలో వాడుతరు. అధికారం, పెత్తనం, పవర్‌ అనేటివి మనుషులను మనుషులుగా నిలబడనివ్వవు. అంతకు ముందు మన మిత్రుడే అయినా ఏదైనా పవర్‌లోకి వస్తే లేదా పెద్ద పోస్ట్‌లో ఉంటే ప్రవర్తన మారిపోతుంది. కొందరు మామూలుగా వుంటరు. ఎప్పుడైనా లోకంలో మంచివాళ్లు తక్కువగా వుంటరు. పెత్తనం దొరకంగనే నెత్తి గొరిగే వాళ్లే ఎక్కువ వుంటరు. ఇట్లా నిర్ణయక శక్తిగా వున్నవారు ఎప్పుడు ఎవలకు ఏ పని చేయాలో వాల్లకు చేయరు. ఇంకో పని చేస్తుంటరు. ఇలాంటి వాల్లనే ‘ఊరికి పోయేటోనికి సద్ది కట్టుక, ఏరుగ పోయేటోనికి కట్టినట్లు’ అంటరు. సాధారణంగా ఇంటి నుంచి ఆ కాలంలో ఇంకో ఊరికి వెళ్లాలంటే సద్ది కట్టుకుని వెళ్లేవాళ్లు. అలాంటిది ఊరికి వెళ్లేవాల్లకి వదిలిపెట్టి బహిర్భూమికి వెళ్లేవాల్లకు సద్ది గట్టినట్టు అనే సామెతను వాడుతరు. –
అన్నవరం దేవేందర్‌
9440763479