‘మున్నేరు’కు అడ్డుగోడ

– రూ.692 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల
– నదికి ఇరువైపులా 8.5 కి.మీ పొడవునా ఆర్‌సీసీ వాల్‌
– 10 మీ. ఎత్తుతో పోలేపల్లి నుంచి ప్రకాశ్‌నగర్‌ వరకు నిర్మాణం
– మధ్యలో రెండు మీటర్ల ఎత్తుతో మూడు చెక్‌డ్యామ్‌లు!
– 3.5 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఆధారంగా డిజైన్‌
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మున్నేరు వరదల నుంచి ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్‌ మండల వాసులకు విముక్తి లభించింది. రూ.692.5 కోట్లతో ఆర్‌సీసీ (రెయిన్‌ఫోర్స్‌డ్‌ సిమెంట్‌ కాంక్రీట్‌) వాల్‌ నిర్మాణానికి ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. దీని ప్రతులను మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ విలేకరులకు పంపిణీ చేశారు. ఈ వాల్‌ నిర్మాణం, దీని ప్రత్యేకతల గురించి వివరించారు. వరదలు వచ్చిపోయిన నెలరోజుల వ్యవధిలోనే శాశ్వత పరిష్కారం చూపుతున్నట్టు ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రెండేండ్ల కిందట ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల సందర్భంగా మొదలైన మున్నేరుపై అడ్డుగోడ హామీ ప్రస్థానం అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళైనా నెరవేరుతుండటంపై పరివాహక ప్రాంత వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
మొత్తానికి మున్నేరుకు మహర్దశ..
రెండున్నరేండ్ల క్రితం మున్నేరుపై కరకట్ట నిర్మాణానికి రూ.146 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. కానీ అది ఆచరణకు నోచుకోకపోవడంతో జులై 27, 2023 ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతాన్ని వరద అతలాకుతలం చేసింది. మొత్తంగా నగరంలోని దాదాపు ఆరేడు డివిజన్లు, ఖమ్మం రూరల్‌ మండలంలో నాలుగు పంచాయతీల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉండటంతో పలువురు నిరాశ్రయులయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వచ్చిన ఈ వరదల పుణ్యమాని.. ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించింది. కరకట్ట నిర్మించకపోతే జిల్లాలోని రెండు జనరల్‌ నియోజకవర్గాలు ఖమ్మం, పాలేరు ఫలితాలపై ఆ ప్రభావం ఉంటుందని భావించి వేగంగా నిర్ణయం తీసుకుందన్న ప్రచారం జరుగుతున్నది. కరకట్టకు బదులు ఆర్‌సీసీ వాల్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం తాజాగా రూ.692.5 కోట్లు మంజూరు చేస్తూ విడుదల చేసిన జీవోను మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ మంత్రిగా తన నాలుగేండ్ల ప్రస్థానం సందర్భంగా సోమవారం మీడియాకు రిలీజ్‌ చేశారు. మరో నెలరోజుల్లో ఆర్‌సీసీ వాల్‌ పనులు ప్రారంభమవుతాయని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. 2006లోనూ ఇలాగే వరదలు వచ్చినా ఇంతగా నష్టం వాటిల్లలేదు. ఈసారి భారీ నష్టం ఉండటంతో ప్రభుత్వం స్పందించడంపై మున్నేరు పరివాహక ప్రాంత వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మున్నేరు వరదలు.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ‘నవతెలంగాణ’ అనేక కథనాలు రాసింది. ఇందుకుగాను స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.