ఓ అందగత్తె ప్రేమ కథ

చిగురుపాటి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎం.ఎస్‌. చంద్ర, హరిలు హీరోలుగా అక్షఖాన్‌ హీరోయిన్‌గా చిగురుపాటి సుబ్రమణ్యం రచన, సాహిత్యం, స్క్రీన్‌ప్లేతో స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నెల్లూరి నెరజాణ’. ‘ఓ అందగత్తె ప్రేమకథ’ అనేది ట్యాగ్‌లైన్‌. 175 మందికి పైగా కొత్త వారితో, ఐదుగురు ప్యాడింగ్‌ ఆర్టిస్ట్‌లతో నిర్మించిన ఈ చిత్రం టీజర్‌, ఫస్ట్‌లుక్‌ కార్యక్రమం ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. డైరెక్టర్‌ నాగ్‌అశ్విన్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి టీజర్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ… చిగురుపాటి సుబ్రమణ్యం నా దగ్గర ఓ వెబ్‌ సిరీస్‌కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ సినిమాను తెరకెక్కించటానికి చాలా కష్టపడ్డాడు. ఇంతకు ముందు ఒక సినిమా డైరెక్ట్‌ చేశాడు. మంచి టాలెంట్‌ ఉన్న వ్యక్తి. టీం అందరూ ఎంత కష్టపడ్డారో ఈ ట్రైలర్‌ చూస్తుంటేనే అర్ధమౌతోంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ గొప్ప లైఫ్‌ను ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు. హీరో ఎం.ఎస్‌. చంద్ర మాట్లాడుతూ… మమ్మల్ని ఆశీర్వదించటానికి వచ్చిన నాగ్‌ అశ్విన్‌ గారికి కతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన చిగురుపాటి సుబ్రమణ్యంకి థ్యాంక్స్‌. ఆయన మా దర్శకుడు అనడం కన్నా.. గురువు అంటేనే బాగుంటుంది అన్నారు.
మరో హీరో హరి మాట్లాడుతూ… నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్‌ సుబ్రమణ్యంకి ఎప్పటికీ రుణపడి ఉంటా. అందరం చాలా కష్టపడి సినిమా చేశాం. ప్రేక్షకులు సూపర్‌హిట్‌ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు. దర్శక, నిర్మాత చిగురుపాటి సుబ్రమణ్యం మాట్లాడుతూ… మమ్మల్ని ఆశీర్వదించటానికి వచ్చిన నాగ్‌ అశ్విన్‌కి మా యూనిట్‌ తరపున కతజ్ఞతలు. ఈ చిత్రానికి నాతోపాటు యూనిట్‌ మొత్తం చాలా కష్టపడిరది. సంవత్సర కాలంగా మాకు ఈ సినిమానే జీవితం అయిపోయింది. ఇందులో నటించిన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ అందరూ డబ్బులు ప్రధానంగా చూడకుండా పని చేశారు. సినిమా అంతా నెల్లూరు యాసలో సాగుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం మాకు చాలా సహకరించింది. ఈ సినిమాను ఆదరించండి… తప్పకుండా ప్రేక్షకులకు నచ్చే సినిమాలనే తీస్తాను. మొత్తం 5 పాటలు, 6 ఫైట్‌లు ఉంటాయి. ప్రతి ఆర్టిస్ట్‌, టెక్నీషియన్‌ తమ స్వంత సినిమాగా భావించి పనిచేశారు. ఇంతమంది ఇంత ప్రేమతో చేసిన ఈ ‘నెల్లూరి నెరజాణ’ను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం నాకుంది అన్నారు.