ఎవలకు ఏమి వుంటే మంచిగ వుంటదో వాల్లకు అది వుండదు. ఉదాహరణకు ‘ఎద్దున్నోనికి బుద్ది వుండది – బుద్ది వున్నోనికి ఎద్దు వుండది’ అనే సామెత వాడుతరు. అంటే నాగలి దున్నేందుకు ఎద్దు వుంటది కానీ దున్నరాదు. అట్లనే వ్యవసాయం పని వస్తది కానీ దున్నేందుకు ఎద్దు వుండది కొందరికి. అందుకే అన్నపు రాశులు ఒక దిక్కు, ఆకలి కేకలు ఒకదిక్కు అని కాళోజీ అంటారు. ఎద్దుల సంపద వుంటేనే వ్యవసాయం పచ్చగా వున్నట్లు. ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చినయి గని, ఎనుకట కాలంల ఎడ్లు, ఆవులు, బర్లు ఎక్కువ వున్నోల్లదే పెద్ద ఎవుసం అని లెక్క తెల్సుకునే వాల్లు. అందుకే ‘ఎద్దు ఎక్కినోడే లింగడు, గద్దె ఎక్కినోడే రంగడు’ అనే సామెతను గొప్పకోసం వాడేవారు. అట్టనే ‘కందం రాసినోడే కవి, పందిని సంపినోడే బంటు’ అన్నరీతిలో వాడేవారు. నాగలి దున్నే ఎద్దుకు అంత ప్రాధాన్యం వుండేది. ఇప్పుడైతే ఆవులకు విలువలు ఆపాదించబడుతున్నయి. అది వేరే సంగతి కానీ, ‘ఎద్దుకు మ్యాత ఏసి ఆవును పాలు ఇవ్వమన్నుట్టు’ అనే సామెత కూడా వున్నది. మనకు పాలు కావాలి అంటే ఆవు పాలు ఇస్తది. ఆ ఆవుకే మేత మంచిగ బలవర్థకంగా వేయాలి గాని ఎద్దుకు ఏస్తే ఈ ఆవు పాలు ఇవ్వదు కదా అనే అర్ధంలో వాడుతరు. అట్లనే ‘ఎద్దు పుండు కాకికి ముద్దా’ అంటరు. ఎవల సమస్యలు, అనారోగ్యాలు వాల్లకే వుంటయి. కాకపోతే వచ్చి మాట్లాడుతరు. అంతేగాని సమస్య నుంచి, నొప్పి నుంచి ఎవరికి వారే బయటపడాలె. అవస్త అనుభవించాల్సిందే. అందుకే ఎద్దుకు పుండు అయితే, కాకి దానిమీద వాలి ఆ పుండును పొడుస్తది. ఎందుకంటే అంట్ల ఏమన్నా దొరుకుతదా అని చూస్తది. పాపం ఎద్దుకు అవస్త అయితది. ఇంకో గమ్మత్తి సామెత ఏందంటే ‘ఎద్దు అయి ఏడాది బతికే కంటే కోల్ల్యాగ లెక్క ఆర్నెల్లు సాలు’ అంటరు. అంటే ఎద్దు అంటే యవ్వనం నుంచి వట్టిపోయింది అన్నట్టు. కాని కోల్ల్యాగ అట్ల కాదు. దానికి ఎక్కడ పడితే అక్కడ ఎదకు వచ్చిన పెయ్యల వెంబడి తిరుగుతది. సామెతలన్నీ జన జీవనంలో నుంచే పుట్టినయి. కొందరు ‘ఎద్దుకు ఎగేసి బర్రెకు తగేస్తరు’ అంటే లొల్లి పుట్టించేందుకు ఇటు చెప్పుతరు, అటు చెప్పుతరు. నడుమ లొల్లి చూసి ఆనందిస్తరు.
– అన్నవరం దేవేందర్, 9440763479