
– కొడుకు పుట్టినరోజే చావురోజు కావడం విచారకరం..
నవతెలంగాణ – ఊరుకొండ
కొడుకు పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని ఉదయాన్నే ఊరుకొండ పేట అభయాంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుగు ప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. ఊరుకొండ మండల కేంద్రంలోని కల్వకుర్తి – జడ్చర్ల ప్రధాన రహదారిపై ఎన్ హెచ్ 167 ప్రధాన రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందగా.. తల్లి కూతురు తీవ్రగాయలు కావడంతో వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. స్థానిక ఎస్సై డి.లెనిన్, స్థానికుల కథనం ప్రకారం.. కల్వకుర్తి పట్టణంలోని తిలక్ నగర్ కు చెందిన టేకులపల్లి వెంకటయ్య ఆనిత దంపతులు తమ కుమారుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా దైవ దర్శనానికని ఊరుకొండ పేట శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి.. పూజలు నిర్వహించుకుని తిరుగు ప్రయాణంలో ఊరుకొండ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు అతివేగంగా ఓవర్టేక్ చేయబోయి బైక్ ను ఢీకొట్టడంతో బలమైన గాయాలైన తండ్రి వెంకటయ్య(45), కొడుకు రామ్ చరణ్ (5) లు అక్కడికక్కడే మృతి చెందారని ఎస్ఐ తెలిపారు. తీవ్ర గాయాల పాలైన అనిత, నిఖిత లను చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వెల్దండ మండల కేంద్రంలోని ఎన్నమ్స్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి అన్న ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై లెనిన్ తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఒకే రోజు అకస్మాత్తుగా చనిపోవడంతో వారి కుటుంబీకులు బంధువులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
