తిరువనంతపురం : కేరళలో బాంబు దాడులకు పాల్పడిన వారికి హమాస్‌తో సన్నిహిత సంబంధాలున్నాయంటూ విద్వేష వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. సమాజంలోని భిన్న వర్గాల మధ్య మత విద్వేషాన్ని పెంపొందిస్తూ, సామరస్యతను విచ్ఛిన్నం చేస్తున్నందుకు ఈ కేసు నమోదు చేసినట్లు కేరళ సైబర్‌సెల్ పోలీసులు తెలిపారు. ఐపిసిలోని సెక్షన్ 153 (ఎ) (మతం, వర్ణం, నివాసం, పుట్టిన స్థలం ప్రాతిపదికన భిన్న గ్రూపుల మధ్య శతృత్వాన్ని పెంచి పోషించడం), కేరళ పోలీసు చట్టంలోని సెక్షన్ 120 (0)(ప్రజా వ్యవస్థ ఉల్లంఘన)కింద కేంద్ర మంత్రిపై అభియోగాలు మోపారు. తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్, రాహుల్ గాంధీ కుమ్మక్కయ్యారని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఎల్‌డిఎఫ్, కాంగ్రెస్ అనుసరించే మైనారిటీ బుజ్జగింపు ధోరణే కేరళ రాష్ట్ర ఇబ్బందులకు కారణమంటూ మరోసారి విషం గక్కారు. కోచిలోని కలామస్సెరి మీటింగ్ హాల్‌లో ఇటీవల బాంబు దాడి జరగ్గా, తానే బాంబు పెట్టినట్టు జెహోవా విట్నెసెస్ అనుచరుడు డొమినిక్ మార్టిన్ అంగీకరించారు. ఈ ఘటనను ముస్లిములకు ఆపాదిస్తూ, ఇజ్రాయిల్‌పై హమస్ దాడితో ఈ బాంబు పేలుడును సమానం చేస్తూ కేంద్ర మంత్రి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే.
అనిల్ ఆంటోనిపై మరో కేసు
మరో ఘటనలో వివిధ వర్గాల మధ్య మత విద్వేషాన్ని రగులుస్తున్నారంటూ కాంగ్రెస్ నేత ఎకె ఆంటోనీ కుమారుడు, బిజెపి నేత అనిల్ ఆంటోనీపై కేసు నమోదైంది. కాసర్‌గోడ్ సైబర్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. పాసింజర్ బస్సును దిగ్బంధించిన కొంతమంది విద్యార్థుల చిత్రాలను మత విద్వేష ప్రచారానికి అనిల్ ఉపయోగించారు. హిజాబ్ ధరించకుండా ఉత్తర కేరళలో ఏ మహిళ కూడా ప్రయాణించడానికి అనుమతించలేదంటూ ఆ విజువల్స్‌కు శీర్షికను జతపరిచారు.