– వివరించిన హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు, కమిషనర్
నవతెలంగాణ-వరంగల్
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరంగల్ మహ నగరపాలక సంస్థ పరిధిలో వరద నష్టాన్ని అంతర్ మంత్రిత్వ శాఖ కేంద్ర బృందం మంగళవారం పరిశీలించింది. ఏడుగురు సభ్యుల కేంద్ర బృందంలో ఎన్‌డీఎంఏ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి (టీం లీడర్), డిప్యూటీ సెక్రటరీ అనిల్ గైరోల్, రీజినల్ ఆఫీసర్ కుష్వా, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డైరెక్టర్ రమేష్ కుమార్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ పూను స్వామి, హైదరాబాద్ ఎన్‌ఆర్‌ఎస్సీ డైరెక్టర్ శ్రీనివాసులు, పవర్ భవ్య పాండే ఉన్నారు. ఈ బృందం గ్రేటర్ వరంగల్‌లో దెబ్బతిన్న ఇండ్లు, రహదారులతో పాటు దెబ్బతిన్న పంటలు, వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ముందుగా హన్మకొండ కలెక్టరేట్‌లో హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో, వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. అనంతరం వరదలతో దెబ్బతిన్న, నష్టపోయిన వివరాలను కేంద్ర పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా హన్మకొండ, వరంగల్ కలెక్టర్లు సిక్టా పట్నాయక్, ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా కేంద్ర బృందానికి వివరించారు.
వరంగల్ నగరంలో జులై 18 నుంచి 27 వరకు 600 ఎంఎం వర్షపాతం నమోదయిందని కమిషనర్ తెలిపారు. దెబ్బతిన్న 150.61 కి.మీ సీసీ రోడ్డుకు రూ110.71 కోట్లు, 82.73 కి.మీ బీటీ రోడ్డుకు రూ.92.94 కోట్లు, 84.56 కి.మీ మెటల్ రోడ్డుకు రూ.43.55 కోట్లు, 75.23 కి.మీ గ్రావెల్ రోడ్డుకు రూ.9.37 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. అలాగే, 128 కి.మీ మురుగు కాలువలకు రూ.63.9 కోట్లు, 71 కల్వర్టులకు రూ.52.41 కోట్లు, 41.3 కి.మీ మంచినీటి పైప్‌లైన్‌లకు రూ.25 కోట్లు నష్టం జరిగిందని వివరించారు.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌కు.. 535 కంప్లైంట్స్ రాగా 5 రెస్పాన్స్ టీమ్‌ల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, నగరంలో 199 కాలనీలు పాక్షికంగా నీటిలో మునగగా క్లియర్ చేసినట్టు తెలిపారు. పడిపోయిన 32 వృక్షాలను తొలగించామన్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ద్వారా 27 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 3500 వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వారికి భోజన సదుపాయం కల్పించినట్టు తెలిపారు. అనంతరం కేంద్ర బృందం కలెక్టర్లు కమిషనర్, అధికారులతో కలిసి గ్రేటర్ వరంగల్ పరిధిలోని జవహర్ నగర్, పోతననగర్ ప్రాంతంలో భద్రకాళి బండ్ చెరువుకు గండిపడిన ప్రాంతాన్ని, బొంది వాగు ప్రాంతాన్ని పరిశీలించారు.
కేంద్ర బృందంతో అడిషనల్ కలెక్టర్ జి.మహేందర్, నీటి పారుదల శాఖ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఆర్ అండ్ బీ సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.