మహిళా విముక్తికి ఛాంపియన్‌

అలెగ్జాండ్రా మిఖైలోవ్నా కొల్లంతారు… కమ్యూనిస్టు విప్లవకారిణి. బోల్షివిక్‌ పార్టీలో కీలక పాత్ర పోషించిన నాయకి. ఆధునిక రాజ్యాలు ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలలో భాగస్వామి అయిన ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళ. ఆనాటి లెనిన్‌ ప్రభుత్వంలో సంక్షేమం కోసం పీపుల్స్‌ కమీషనర్‌గా పనిచేసిన వ్యక్తి. అలాగే కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి మహిళ అంతేనా మొదటి మహిళా దౌత్యవేత్త. ఈ పురుషాధిక్య సమాజంలో వందేండ్ల కిందటే స్వేచ్ఛా ప్రేమను సమర్ధించిన సాహసి. ‘లైంగికత అనేది ఆకలి లేదా దాహం వంటి సహజమైన మానవ స్వభావం’ నొక్కి చెప్పిన వనిత. మహిళా విముక్తి కోసం అలుపెరుగక పోరాడిన ధీర. ఈ రోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఇలాంటి మహిళా మూర్తులు చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితమే.

కొల్లంతారు ఇంపీరియల్‌ రష్యన్‌ ఆర్మీ జనరల్‌ కూతురు. ఆమె 1890లలో కమ్యూనిస్టు రాజకీయాలను స్వీకరించారు. 1899లో రష్యన్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ లేబర్‌ పార్టీలో చేరారు. ఈ పార్టీలో చీలికలు వచ్చినపుడు మెన్షివిక్‌లకు దగ్గరయ్యారు. 1908లో రష్యా నుండి బహిష్కరించబడిన ఆమె పశ్చిమ ఐరోపా, యునైటెడ్‌ స్టేట్స్‌లో పర్యటించి మొదటి ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. 1915లో ఆమె మెన్షెవిక్‌లతో తెగతెంపులు చేసుకొని బోల్షెవిక్‌లలో సభ్యురాలిగా చేరారు. 1917 ఫిబ్రవరి విప్లవం తర్వాత ఆమె రష్యాకు తిరిగి వచ్చారు. ఆనాడు ఆమె కార్మికుల పక్షాన పోరాడుతున్న లెనిన్‌ ప్రతిపాదనలకు మద్దతుగా నిలిచారు. మొదటి సోవియట్‌ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమానికి పీపుల్స్‌ కమీషనర్‌గా నియమితులయ్యారు. 1919లో సోవియట్‌ యూనియన్‌లో మహిళల స్థితిని మెరుగు పరచడానికి ఉద్దేశించిన సెంట్రల్‌ కమిటీ ఓ కొత్త మహిళా విభాగం జెనోట్‌డెల్‌ ఏర్పాటు చేశారు. దీన్ని నిర్మించడంలో కొల్లంతారు ముఖ్య పాత్ర పోషించారు. మహిళా విముక్తికై పోరాడుతున్న కమ్యూనిస్ట్‌ పార్టీపై నిప్పులు చెరిగే వారికి ఆమె ధైర్యంగా సమాధానం చెప్పేవారు. 1922 నుండి ఆమె నార్వే, మెక్సికో, స్వీడన్‌లలో దౌత్యవేత్తగా బాధ్యతలు నిర్వహించారు. 1943లో స్వీడన్‌కు రాయబారిగా పదోన్నతి పొందింది. 1945లో ఆ బాధ్యతల నుండి రిటైర్‌ అయ్యారు.
కుటుంబ నేపథ్యం
కొల్లంతారు తండ్రి, జనరల్‌ మిఖాయిల్‌ అలెక్సీవిచ్‌ డోమోంటోవిచ్‌. ప్స్కోవ్‌కు చెందిన డౌమంటాస్‌ వంశానికి చెందిన ఉక్రేనియన్‌ కుటుంబం వీరిది. తల్లి, అలెగ్జాండ్రా అలెగ్జాండ్రోవ్నా మసాలినా. ఈమె తన మొదటి భర్తతో జీవితాన్ని గడపలేక అతనికి విడాకులిచ్చి డోమోంటోవిచ్‌ను వివాహం చేసుకుంది. ఈ కారణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కోవలసి వచ్చింది. అధికారికంగా పెండ్లి చేసుకున్నప్పటికీ తన తల్లిదండ్రులు కలిసి జీవించేందుకు సుదీర్ఘ పోరాటం చేయవలసి వచ్చింది. ఈ ప్రభావం కొల్లంతారుపై తీవ్రంగా ఉండేది. కాబట్టే స్త్రీ, పురుష సంబంధాలు, లైంగికత, వివాహం గురించి ఆమె చాలా స్పష్టంగా ఉండేది. వాటినే బాహాటంగా చర్చించేది.
ఉన్నత విద్య కోసం…
కొల్లంతారు మార్చి 1872, మార్చి 31న సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జన్మించారు. ఆమె తండ్రికి ఎంతో సన్నిహితంగా ఉండేది. చరిత్ర, రాజకీయ విషయాల గురించి ఆయనతో ఆసక్తిగా పంచుకునేది. పాఠశాలలో మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకుంది. తండ్రి ద్వారా అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. పాఠశాల తర్వాత విశ్వవిద్యాలయంలో తన చదువు కొనసాగించాలనుకుంది. కానీ తల్లి అంగీకరించలేదు. అమ్మాయిలకు ఉన్నత విద్య అవసరం లేదని ఆమె భావన. కాబట్టి వెంటనే పెండ్లి చేసుకోవాలంది. దాంతో ఆమె తన 19 ఏండ్ల వయసులో తన బంధువు, కాబోయే భర్త అయిన వ్లాదిమిర్‌ లుడ్విగోవిచ్‌ కొల్లంతారును కలుసుకుంది. మిలిటరీ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన ఇంజనీరింగ్‌ విద్యార్థి అతను. అతను పేదవాడు కావడంతో తల్లి వారి వివాహానికి అభ్యంతరం చెప్పింది. ఎలాగైనా ఆమె వ్లాదిమిర్‌ను మరచిపోవాలని కూతురిని పశ్చిమ ఐరోపా పర్యటనకు పంపారు. కానీ అనుకున్నట్టు జరగదు. 1893లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. 1894లో ఆమెకు కొడుకు పుట్టాడు. ఆ విశ్రాంతి సమయాన్ని మార్క్సిస్ట్‌ రాజకీయ సాహిత్యం చదవడానికి, రాయడానికి తన సమయాన్ని వెచ్చించింది.
రాజకీయ జీవితం
కొల్లంతారు మొదట్లో మీర్‌ కమ్యూన్‌ ఆధారంగా సమాజాన్ని పునర్నిర్మించాలనే ఆలోచనలకు ఆకర్షితురాలయింది. అయితే కొన్ని కారణాల రీత్యా దాన్ని విడిచిపెట్టింది. ఆ తర్వాత మార్క్సిజం, ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలు, కార్మికులు పోరాటం చేసి అధికారాన్ని చేజిక్కించుకోవడం, పరిశ్రమల్లో పెరిగిపోతున్న దోపిడీని నొక్కిచెప్పేవారు. దాంతో రష్యాలోని మేధావి వర్గంలో కొల్లంతారుకు మంచి గుర్తింపు వచ్చింది. ఆనాడు ప్రజల్లో ఉన్న పిరికితనాన్ని పోగొట్టడం. దానికోసం పట్టణ కార్మికులకు ప్రాథమిక అక్షరాస్యత అందించేందుకు తన చెల్లెలు జెనియాతో కలిసి ప్రతి ఆదివారం తరగతులు నిర్వహించేది. అక్షరాలు నేర్పిస్తూనే సోషలిస్ట్‌ ఆలోచనలు ఎక్కించేది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ప్రేమించి పెండ్లి చేసుకున్న భర్త నుండి విడిపోయింది. చిన్నవాడైన కొడుకుని తల్లిదండ్రుల వద్ద విడిచి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ప్రొఫెసర్‌ హెన్రిచ్‌ హెర్క్‌నర్‌తో కలిసి ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించింది. తర్వాత ఇంగ్లాండ్‌కు వెళ్ళింది. అక్కడ సిడ్నీ, బీట్రైస్‌ వెబ్‌లతో సహా బ్రిటిష్‌ సోషలిస్ట్‌ ఉద్యమ సభ్యులను కలుసుకుంది. 1899లో రష్యాకు తిరిగి వచ్చి లెనిన్‌ని కలిసింది.
మార్క్సిస్ట్‌ ఆలోచనలపై ఆసక్తి
హెర్క్‌నర్‌ ఆధ్వర్యంలో జ్యూరిచ్‌లో పని చేసే ఉద్యమాల చరిత్రను అధ్యయనం చేస్తున్నప్పుడు కొల్లంతారు మార్క్సిస్ట్‌ ఆలోచనలపై ఆసక్తి పెంచుకుంది. తన 27 ఏండ్ల వయసులో 1899లో రష్యన్‌ సోషల్‌ డెమోక్రాటిక్‌ లేబర్‌ పార్టీలో సభ్యురాలయింది. 1903లో జూలియస్‌ మార్టోవ్‌ ఆధ్వర్యంలోని మెన్షెవిక్‌లు, లెనిన్‌ నేతృత్వంలోని బోల్షెవిక్‌ల మధ్య రష్యన్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ లేబర్‌ పార్టీలో చీలిక ఏర్పడిన సమయంలో ఆమె మొదట ఏ పక్షం వైపు మొగ్గు చూపలేదు. రెండు వర్గాలకు తన సేవలను అందించింది. అయితే 1906లో మెన్షెవిక్‌లలో చేరాలని నిర్ణయించుకుంది. 1908లో జర్మనీకి ప్రవాసంలోకి వెళ్లింది. పశ్చిమ ఐరోపా అంతటా ప్రయాణించి కార్ల్‌ కౌట్‌స్కీ, క్లారా జెట్‌కిన్‌, రోసా లక్సెంబర్గ్‌, కార్ల్‌ లైబ్‌నెచ్ట్‌ వంటి వారితో పరిచయం పెంచుకుంది.
యుద్ధానికి వ్యతిరేకంగా…
1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా ప్రవేశించడంతో కొల్లంతారు యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. దానికి వ్యతిరేకంగా బాహాటంగా మాట్లాడింది. 1915లో మెన్షెవిక్‌లతో తెగతెంపులు చేసుకుని లెనిన్‌ నాయకత్వంలో సామాజిక దేశభక్తితో స్థిరంగా పోరాడిన బోల్షెవిక్‌లలో చేరింది. జర్మనీని విడిచిపెట్టిన తర్వాత కొల్లంతారు డెన్మార్క్‌కు వెళ్లింది. యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడిందని స్వీడిష్‌ ప్రభుత్వం ఆమెను జైల్లో పెట్టింది. విడుదలైన తర్వాత నార్వేకు వెళ్లింది. అక్కడ ఆమె తన ఆలోచనలను అంగీకరించే ఒక సోషలిస్ట్‌ బృందాన్ని కలిసింది. 1917 వరకు నార్వేలోనే ఉంది. యుద్ధం, రాజకీయాల గురించి మాట్లాడంతో పాటు తన కొడుకు మిఖాయిల్‌ను కలిసేందుకు రెండుసార్లు యునైటెడ్‌ స్టేట్స్‌కు వెళ్లింది. 1917 ఫిబ్రవరి విప్లవం గురించి విన్న తర్వాత నార్వే నుండి రష్యాకు తిరిగి వచ్చింది.
రష్యన్‌ విప్లవం
ఏప్రిల్‌ 1917లో బోల్షెవిక్‌ల ఏకైక ప్రధాన మహిళా నాయకురాలు కొల్లంతారు. ఆమె పెట్రోగ్రాడ్‌ సోవియట్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలు. 1917లో రష్యాలో ఒక స్పీకర్‌గా, కరపత్ర రచయితగా, బోల్షివిక్‌ మహిళా పేపర్‌ రాబోట్నిట్సాలో కార్మికురాలిగా విప్లవం కోసం నిరంతరం ఉద్యమించింది. అక్టోబరు 26న జరిగిన రెండవ ఆల్‌-రష్యన్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ సోవియట్‌లో ఆమె మొదటి సోవియట్‌ ప్రభుత్వంలో సోషల్‌ వెల్ఫేర్‌ పీపుల్స్‌ కమీషనర్‌గా ఎన్నికయ్యారు. సోవియట్‌ పరిపాలనలో అత్యంత ప్రముఖ మహిళగా ఉన్న ఆమె 1919లో ‘మహిళల విభాగం స్థాపనకు కీలక పాత్ర పోషించారు. ఈ సంస్థ సోవియట్‌ యూనియన్‌లో మహిళల జీవిత పరిస్థితులను మెరుగుపరచడానికి, నిరక్షరాస్యతతో పోరాడటానికి, విప్లవం ద్వారా కొత్త వివాహం, విద్య, ఉద్యోగ చట్టాల గురించి మహిళలకు అవగాహన కల్పించడానికి పనిచేసేది.
మహిళా హక్కులపై…
కొల్లంతారు ఉదార స్త్రీవాద భావజాలాన్ని వ్యతిరేకించింది. అదే సమయంలో ఆమె మహిళా విముక్తి ఛాంపియన్‌. 1946లో ఒక రష్యన్‌ మ్యాగజైన్‌కు ఆమె రాసిన ఒక వ్యాసాన్ని చదివితే మహిళా హక్కులపై సోవియట్‌ యూనియన్‌ సాధించిన విజయాలు మనకు కనిపిస్తాయి. వాటిని ఆమె ఎంతో ప్రశంసించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సం కోసం అహర్నిశలూ పోరాడిన వారిలో కొల్లంతారు కూడా ఒకరు. అలాంటి ఆమె పుట్టింది, మరణించింది మార్చి నెలలోనే. కొల్లంతారు మాస్కోలో 9 మార్చి 1952న తన ఏనభై ఏండ్ల వయసులో మరణించింది.

ప్రశ్నించే తత్వాన్ని వదల్లేదు
అక్టోబర్‌ విప్లవానికి నాయకత్వం వహించిన బోల్షెవిక్‌ల సెంట్రల్‌ కమిటీలో 1950 వరకు కొనసాగిన ఏకైక సభ్యురాలు ఆమె. ఆమె కొన్నిసార్లు తీవ్రంగా విమర్శించబడింది, ధిక్కారం కూడా ఎదుర్కొంది. అయినా తన ప్రశ్నించే తత్వాన్ని వదులుకోలేదు. 1970లలో స్త్రీవాద ఉద్యమానికి కొల్లోంటై జీవితం, రచనలపై కొత్త ఆసక్తిని రేకెత్తించింది. చరిత్రకారులు కాథీ పోర్టర్‌, బీట్రైస్‌ ఫార్న్స్‌వర్త్‌, బార్బరా ఎవాన్స్‌ క్లెమెంట్స్‌లు ఆమె జీవితంతో పాటు అనేక పుస్తకాలు, కరపత్రాలు ప్రచురించారు. 1982లో రోసా వాన్‌ ప్రౌన్‌హీమ్‌ కొల్లోంటై రాసిన నవల ఆధారంగా రెడ్‌ లవ్‌ అనే చిత్రాన్ని నిర్మించారు.