ఈ మధ్య కాలంలో బంధాలకు విలువ లేకుండా పోతుంది. గతంలో కుటుంబాలు ఉమ్మడిగా ఉండేవి. ఏ చిన్న సమస్య వచ్చినా కుటుంబంలోని పెద్దలు దానిని సరిదిద్దేవారు. అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరు ఇంకొకరితో ఎలా మెలగాలో చెప్పేవారు. ఏ బంధానికి ఎంత విలువ ఇవ్వాలో తెలియజేసే వారు. ఎవరితో ఎలా మెలగాలో పిల్లలకు చిన్నతనం నుండే నేర్పేవారు. పెద్ద వాళ్ళను గౌరవించేవారు. ఏం చెప్పినా తమ మంచి కోసమే చెబుతున్నారని వినేవారు. వదినను సొంత తల్లిలా, అన్నను తండ్రిలా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాంతో విచ్చలవిడితనం పెరిగిపోతోంది. ఫలితంగా అనేక సమస్యలు వస్తున్నాయి. అలాంటి ఓ సమస్యే ఈ వారం ఐద్వా అదాలత్…
నిరుపమకు 36 ఏండ్లు ఉంటాయి. తన స్నేహితురాలితో కలిసి ఐద్వా అదాలత్‌కు వచ్చింది. ఆమెకు పెండ్లి జరిగి సుమారు 15 ఏండ్లు అవుతుంది. ముగ్గురు పిల్లలున్నారు. భర్త ప్రయివేటు ఉద్యోగి. ఇంట్లో అత్తా, మామా కూడా ఉంటారు. ఆమెకు ఇద్దరు ఆడపడుచులున్నారు. వాళ్ళు వేరేగా ఉంటారు. తోటికోడలికి ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళు వీళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఉంటారు. వీళ్ళకు నాలుగు దుకాణాలున్నాయి. బావ ఎప్పుడూ బిజీగా ఉంటాడు. నిరుపమ కట్నం కింద ఇచ్చిన పది లక్షలు వడ్డీలకు ఇచ్చారు.
నిరుపమ భర్త రాజు, ఎప్పుడూ అన్న ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటాడు. అన్న దుకాణానికి వెళ్ళిన వెంటనే వెళ్ళి మళ్ళీ ఆయన తిరిగి వచ్చే సమయానికి ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో మాత్రం ఆఫీసుకు వెళుతున్నానని చెప్తాడు. అక్కడ వాళ్ళ వదినకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఇంట్లో పనులన్నీ చేసిపెడతాడు. పిల్లలను స్కూల్‌కి తీసుకెళ్ళడం, తీసుకురావడం, ఇంట్లో కావల్సిన వస్తువులు, కూరగాయలు తెచ్చిపెడతాడు. కరెంటు బిల్లు కట్టడం లాంటి చిన్న చిన్న పనుల నుండి ప్రతి ఒక్కటీ చేసి పెడతాడు. కానీ భార్యకు మాత్రం ఇంట్లో చిన్న సాయం కూడా చేయడు. కనీసం పిల్లల్ని స్కూల్లో వదడం, తీసుకురావడం కూడా చేయడు. మొత్తం ఆమెనే చూసుకునేది. స్కూల్‌కి సెలవులిస్తే తోటికోడలి పిల్లలు కూడా నిరుపమ దగ్గరే ఉండేవారు.
ఆమె అందరినీ చూసుకోలేక ‘పిల్లలు మాత్రమే ఎందుకు, అక్కను కూడా రమ్మంటే బావ వచ్చే వరకు ఇక్కడే ఉంటుంది కదా!’ అన్నా ఆమె మాత్రం ఇక్కడికి వచ్చేది కాదు. పిల్లలను మాత్రం పంపించేది. రాజు, ఆమె కలిసి ఇంట్లో ఉండేవారు. ఇద్దరి మధ్య సంబంధం ఉందని నిరుపమకు చాలా మంది చెప్పారు. కానీ ఆమె నమ్మలేదు. వాళ్ళిద్దరూ కాలేజీ రోజుల్లో స్నేహితులు. అందుకే సన్నిహితంగా ఉంటున్నారని అనుకునేది. వాళ్ళు కూడా నిరుపమకు అనుమానం రాకుండా నడుచుకునేవారు.
ఒకరోజు పిల్లలకు సెలవులని అందరూ నిరుపమ దగ్గరకు వచ్చారు. తల్లికి ఆరోగ్యం బాగోలేదని తన పిల్లలను కూడా తోటికోడలి ఇంటి దగ్గరకు పంపించి ఆమె ఆస్పత్రికి బయలుదేరింది. పిల్లలు ఇంటికి వెళ్ళేసరికి రాజు తన వదిన నందినితో కలిసి బెడ్‌రూంలో ఉన్నాడు. నిరుపమ పిల్లలకు 14 ఏండ్లు ఉంటాయి. నందిని పిల్లలు ఇంకొంచెం పెద్దగా ఉంటారు. ఇంటర్ చదువుతున్నారు. వాళ్ళు తండ్రికి, పిన్నికి ఈ విషయం చెబుతామంటే వద్దని బెదిరించారు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే గొడవలవుతాయని హెచ్చరించారు. పిల్లలు కూడా నిజమే అనుకుని ఆ విషయాన్ని వదిలేశారు.
నందిని వాళ్ళ పాప కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ అబ్బాయితో చాలా చనువుగా ఉండటం ఒక సారి రాజు చూశాడు. దాంతో ఆ పాపను ఇంటికి తీసుకొచ్చి కొట్టాడు. అప్పుడు ఆ అమ్మాయి ‘మా అమ్మతో నువ్వు సంబంధం పెట్టుకోవచ్చు, నేను మాత్రం ప్రేమించిన అబ్బాయితో అలా చేస్తే తప్పేంటి. మేమిద్దరం పెండ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం మీకేంటి సమస్య’ అంటూ ఎదురు మాట్లాడింది.
అప్పుడు నిరుపమకు విషయం తెలిసింది. ఆమె పిల్లలు కూడా రెండు రోజుల తర్వాత తల్లికి విషయం చెప్పారు. పైగా ‘నీకు మా మాట మీద నమ్మకం లేకపోతే మధ్యాహ్నం నువ్వే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడు డాడీ అక్కడే ఉంటాడు’ అన్నారు. ఆమె వెళ్ళి చూస్తే రాజు బండి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. లోపలికెళ్ళి చూసి ఆమె షాక్ అయ్యింది. ఇంటికి వచ్చి అత్తా, మామ, ఆడపడుచులకు విషయం చెప్పింది. అయితే అప్పటికే ఇంట్లో అందరికీ ఈ విషయం తెలుసు. పెండ్లి చేస్తే మారతాడని నిరుపమకిచ్చి పెండ్లి చేశారు. గతంలో కలిసి ఉండే వారు ఈ సమస్య వల్లనే వేరే ఉంటున్నారు.
పెండ్లి చేసినా రాజులో మార్పు రాలేదు. ఒకే ఇంట్లో ఉంటే కనీసం భార్యకు తెలుస్తుందనే భయం ఉండేది. ఇల్లు మారడం అతనికి మంచి అవకాశమయింది. పైగా అత్తమామలు ‘పెండ్లి తర్వాత భర్తను కొంగుకు ముడేసుకోవాలి. అది నీకు చేతకాలేదు. అందుకే వాడు ఇలా చేస్తున్నాడు’ అని నిరుపమనే అంటున్నారు. రాజు ఉద్యోగం కూడా చేయడం లేదు. వచ్చే వడ్డీ డబ్బుతోనే బతుకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తనకు న్యాయం చేయమంటూ నిరుపమ ఐద్వా అదాలత్‌కు వచ్చింది. ‘తల్లిగా భావించాల్సిన వదినతో సంబంధం పెట్టుకున్న వ్యక్తితో నేను ఎలా బతకాలి’ అంటూ కన్నీరు పెట్టుకుంది.
మేము రాజును పిలిపించి అడిగితే ‘అవును మేడం నిరుపమ చెప్పింది నిజమే. కానీ మా సంబంధం పవిత్రమైనది. మేమిద్దరం కాలేజీ రోజుల నుండే ప్రేమించుకుంటున్నాం. అనుకోని పరిస్థితుల్లో ఆమె మా అన్నయ్యను పెండ్లి చేసుకుంది. మా ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తే నేను నిరుపమను పెండ్లి చేసుకున్నాను. ఇప్పటి వరకు ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నాను. భార్యకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే ఉన్నాను. ఎవరు ఎన్ని చెప్పినా నేను నందినిని వదిలి పెట్టి ఉండలేను. ఆమె అంటే నాకు ఇష్టం’ అన్నాడు.
భర్త మాటలు విని ‘ఇలాంటి వ్యక్తితో నేను ఉండలేను. ఇతన్ని చూస్తూ పెరుగుతున్న నా పిల్లలు రేపు ఎలా తయారవుతారో అని నాకు భయంగా ఉంది’ అంటూ బోరున ఏడ్చింది. దాతో మేము అతనితో ‘నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అసలు మీ సంబంధాన్ని సమాజం ఎలా చూస్తుందో తెలుసా? ఇప్పటికే నందిని కూతురు ఎలా ప్రవర్తించిందో చూశావుగా? నిన్నే ఎదిరించి మాట్లాడింది. రేపు నీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారు. అప్పుడు ఏం చేస్తావు? ఎవరు ఎటు పోతే నా కేంటి నేను సుఖంగా ఉంటే చాలు అనుకుంటున్నావా? నీ లాంటి వ్యక్తిని ఎవ్వరూ గౌరవించరు. చివరకు నీ పిల్లలే నిన్ను అసహ్యించుకునే రోజు వస్తుంది. తర్వాత నీ బతుకు ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహించుకో’ అని హెచ్చరించాము.
దాంతో అతను నందిని కూతురిలా రేపు తన పిల్లలు కూడా ఇలాగే చేస్తే ఎలా అనే ఆలోచనలో పడ్డాడు. కానీ ‘ఆలోచించుకోవడానికి నాకు కాస్త సమయం కావాలి’ అని చెప్పి వెళ్ళిపోయాడు. రెండు వారాల తర్వాత నిరుపమ మాకు ఫోన్ చేసి ‘మేడం ఇప్పుడు ఆయనలో కాస్త మార్పు వచ్చింది. అంతకు ముందులా వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళడం లేదు. మా పిల్లలతో గడపుతున్నాడు. త్వరలో ఉద్యోగం కూడా చూసుకుంటా అంటున్నాడు. మీరు ఆయనతో మాట్లాడడం వల్ల కాస్త మార్పు వచ్చింది. ఈయన ఇలాగే ఉంటే నా జీవితం, నా పిల్లల భవిష్యత్తు చక్కగా ఉంటుంది’ అని చెప్పి సంతోషంగా ఫోన్ పెట్టేసింది.
– వై. వరలక్ష్మి, 9948794051