యుద్ధ జ్వాలల్లో మసకబారుతున్న బాల్యం

డా.మహ్మద్‌ హసన్‌, 9908059234 ”లేతబుగ్గల పాలనవ్వుల మురిపాల పాపా! నీ కంటిమీదకు కునుకెలా వస్తుందో నాకు తెలుసు. దివ్యలోకపు అంతరాంతరాలలో ఒక మారుమూల గది నుంచి ప్రవహిస్తోంది నీ కనులపై కాంతి ఓ పాపా! నిద్రలో పరువశిస్తున్న నీ పెదాలపై పారాడే చిరునవ్వు దానికి పుట్టిల్లేదో తెలుసా ఎవరికైనా దాన్ని గురించి చెప్పమంటావా! చవితిరోజు చంద్రుని నుంచి విడిపోయిన ఒక జాబిలి కిరణం విస్తరిస్తున్న వసంతమేఘపు అంచుని స్పృశిస్తే మంచుకోసం నిరీక్షించే ఒకానొక ప్రభాతాన పుట్టిందట ఆ చిరునవ్వు” ఈ వాక్యాలు విశ్వకవి రవింద్రనాద్‌ ఠాగూర్‌ గారి ‘గీతాంజలి’ కావ్యంలోనివి. పై పంక్తుల ప్రకారం పసిపిల్లల మలినంలేని ప్రవర్తన, మనస్తత్వాలు, వారి ఆలోచన విధానం ప్రత్యేకమైనది. తల్లితండ్రులుగా మనం కేవలం వారికి పర్యవేక్షలుగా, మార్గదర్శకాలుగా మాత్రమే ఉండగలం. 1959లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒక డిక్లరేషన్‌ విడుదల చేసింది దానిలో పిల్లల రక్షణ, విద్య, ఆరోగ్యం, శ్రద్ధ, పునరావాసం, ఆశ్రయం, మంచి పౌష్టికమైన ఆహారం కల్పించాలని ప్రపంచదేశాలను కోరింది. అలాగే 2001-2010 సంవత్సరాల దశాబ్ద కాలాన్ని అంతర్జాతీయ సంస్కతి, శాంతి, అహింసలతో కూడిన పిల్లల ప్రపంచాన్ని సష్టించాలని ప్రపంచ దేశాలని కోరింది. ఇక ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఏర్పడిన ఐక్యరాజ్య సమితి కూడా ప్రత్యేకంగా బాలల కోసం 1946లో అంతర్జాతీయ బాలల అత్యవసర నిధిని (ఖచీ×జజుఖీ) ఏర్పాటు చేసింది. దీని లక్ష్యం అభివృద్ధి చెందుతున్న దేశాలలో పిల్లలకు, వారి తల్లులకు జీవన ప్రమాణాలు పెంచటం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం. అలాగే సచిన్‌ టెండూల్కర్‌ లాంటి ప్రముఖ వ్యక్తులను రాయబారులుగా నియమించుకొని ఆ సంస్థ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
యూనిసెఫ్‌ (ఖచీ×జజుఖీ) ప్రపంచవ్యాప్తంగా చేసిన, చేస్తున్న సేవకు గాను 1965లో ”నోబెల్‌ శాంతి బహుమతి”ని కూడా పొందింది. కానీ ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే బాలల హక్కులు ప్రమాదంలో పడుతున్నట్లుగా భావించాలి. మొదటి రెండు ప్రపంచ యుద్ధాలలో జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చరిత్రలో మళ్ళీ జరిగనప్పటికి అంతర్జాతీయంగా చేసుకున్న ఒప్పందాలు, చట్టాలు, ఏర్పడిన శాంతి సంస్థలు వాటి లక్ష్యం ప్రస్తుతం ప్రమాదంలో పడినట్లుగా భావించాలి. అంతెందుకు రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్‌ లోని హిరోషిమ (1945 ఆగష్టు 06) నగరంపై వేసిన అణుబాంబు అనంతరం నాగసాకి పట్టణంపై (ఆగష్టు 09న) వేసిన రెండో అణుబాంబు ద్వారా అరవై వేల నుండి యనబై వేల దాకా మరణించి ఉండొచ్చని, హిరోషిమా దాడిలో ఐతే డెబ్బై వేల నుండి సుమారు ఒక లక్ష ఇరవై ఆరు వేల వరకు సాధారణపౌరులు మరణించి ఉంటారని అంచనా. దీనిలో పిల్లలు, మహిళలు సగం మంది బాదితులే అనేది చారిత్రక సత్యం కూడా. అనంతరం ఈ స్థాయి యుద్ధాలు కాని యుద్ధ పరిణామాలు కాని ప్రపంచవ్యాప్తంగా జరగనప్పటికి దేశాలలోని అంతర్గత సమస్యల వల్ల (లిబియా, అఫ్ఘనిస్తాన్‌, సిరియా) పొరుగు దేశాలతో సరిహద్దు సమస్యలు మరియు ప్రాబల్య రాజకీయల కోసం జరుగుతున్న చిన్నచిన్న యుద్ధాలతో వందలాది మంది చిన్న పిల్లలు నాటి నుండి నేటి రష్యా – యుక్రెయిన్‌ యుద్ధం కావచ్చు, లేదా ‘హమాస్‌’ తిరుగుబాటుదారులకు ఇజ్రాయిల్‌ సైన్యానికి ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కావచ్చు. ఇందులో ప్రధానంగా బలయ్యేది చిన్నపిల్లలు కావటం బాధ కల్గించే అంశం.
ఆయా దేశాలు యుద్ధ సమయాలలో అంతర్జాతీయంగా చేసుకున్న చట్టాలు కాని, ఒప్పందాలు కానీ అమలు చేయకుండా, వాటిని పాటించకుండా అమానవీయంగా ప్రవర్తించటం అనేది మానవత్వానికే మచ్చ. గాజా కేంద్రంగా పరిపాలిస్తున్న ‘హమాస్‌’ అక్టోబర్‌ 07న ఇజ్రాయిల్‌ పై అకస్మాత్తుగా సుమారు ఆరు వేల మోర్టార్‌ షెల్స్‌ ను, రాకెట్లను ప్రయోగించటం వల్ల ఇజ్రాయిల్‌ సైన్యం పాలస్తీనాపై యుద్ధం ప్రకటించింది. ఈ నెలన్నర రోజుల యుద్ధంలో చిన్నపిల్లలే అధికంగా చనిపోయారని ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న శరణార్ధి శిబిరాల నుండి వస్తున్న సమాచారం. ఇప్పటి వరకు అధికారికంగా పాలస్తీనా నుండి పన్నెండు వేలకు పైగా మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలియజేసింది. అందులో చిన్న పిల్లల మరణాలు సుమారు ఆరు వేలు దాటినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. మిగితా వారు వృద్ధులు, మహిళలు వివిధ కారణాల చేత సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళలేని వారు ఉంటారనేది ప్రాధమిక అంచనా. ఇక శిధిలాల్లో గల్లంతైన 2500 మంది పౌరుల్లోను చిన్నారుల సంఖ్య వెయ్యి దాకా ఉంటుందని గాజా ఆరోగ్య శాఖ చెబుతోంది.
ప్రస్తుతం గాజాలో డెబ్బై ఐదు శాతం భవనాలు పూర్తిగా ధ్వంసంకాగా, యాబై శాతంపైగా పాఠశాల భవనాలు ద్వంసం ఐనట్లు అధికారుల అంచన. శిభిరాలలోని బాదితులకు త్రాగునీరు, ఆహారం దొరకక ఆహార నిల్వల కేంద్రాలపై లూఠీ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత హృదయ విదారకంగా ఉందో గమనించవచ్చు. ప్రస్తుతం పాలస్తీనాలోని ఆస్పత్రులు, అంబులెన్సులు, శరణార్ధి శిభిరాలు పాఠశాలలపై బాబుల వర్షం కురిపించి అమానవీయంగా ప్రవర్తించిన ఇజ్రాయిల్‌ సైన్యం అంతర్జాతీయంగా అపవాదును మూటగట్టుకుంది. ప్రస్తుతం గాజా ప్రాంతం గాని పాలస్తీనాలోని ఏ ప్రాంతం కూడా సురక్షితమైంది కాదు. పత్రికా విలేకరులను, ఐక్యరాజ్య సమితి నిర్వహించే శరణార్ధి శిభిరాలలో సహాయం చేస్తున్న ఉద్యోగులను, స్వచ్చంద సంస్థల వాలంటీర్లను కూడా వదలకుండా బాంబుల వర్షం కురిపిస్తుందంటే ఇజ్రాయిల్‌ సైన్యం ఎంతటి మానవ విధ్వంసానికి పాల్పడుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ యుద్ధంలో క్షతగాత్రులుగా మిగిలిన చిన్నారులు బాంబులదాడిలో వికలాంగులుగా మారిన పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల మానసికస్థితి దారుణంగా మారుతోందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. యుద్ధం కారణంగా కూలిపోయిన తమ ఇండ్లను అక్కడే వదిలిన పుస్తకాలను, వారు ఆడుకున్న ఆట వస్తువులను, చనిపోయిన తల్లిదండ్రులను, బడులలోని జ్ఞాపకాలను తలుచుకుంటూ చాలామంది నిద్రకు దూరమవుతున్నారని, చికిత్స పొందేటప్పుడు కూడా అక్కడి దృశ్యాలు హాహాకారాలు చూసి, ఆ మానసిక సంఘర్షణ నుండి ఇంకా బయటపడలేక ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ చివరకు స్మశానంలో శాశ్వతంగా నిద్రపోతున్నారని ఇక బ్రతికున్న పిల్లలు ప్రస్తుతం ప్రత్యక్ష నరకం చూస్తున్నారని యూనిసెఫ్‌ ప్రతినిధి ‘జేమ్స్‌ ఎల్డర్‌’ గాజాను సందర్శించి వ్యక్తం చేసిన మాటలు అవి. అంటే ప్రస్తుతం గాజా ఓ నెత్తుటి గాయాల భూమి అక్కడ పారుతున్న రక్తం, చిద్రమైన శరీర భాగాలు, నేలమట్టమైన ఇండ్లను చూస్తే ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది.
ఇజ్రాయిల్‌ పై యుద్ధం ప్రకటించిన ‘హమాస్‌’ ఏం సాధించింది? తన లక్ష్యాన్ని సాధించిందా? అన్న ప్రశ్న ‘హమాస్‌’ వారు వేసుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. పాలస్తీనా సమస్యను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకొనివచ్చినా ‘హమాస్‌’ అవలంభించిన దూకుడు చర్య వల్ల ఈరోజు పాలస్తీనాలో ఇజ్రాయిల్‌ సైన్యం ద్వారా ఇంత విధ్వంసం జరుగుతోంది. పాలస్తీనా పరిస్థితి ఏమిటి? కోలుకోవడానికి కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు. చనిపోయిన చిన్నారుల ప్రాణాలను మాత్రం ఎవరు తిరిగి తీసుకొని రాలేరు. ఆ పిల్లలు ఆ ప్రాంతంలో పుట్టి ఏం పాపం చేశారు. వారేమైన ఇజ్రాయిల్‌ పై క్షిపణులు ఎక్కు పెట్టారా? బాంబుల వర్షం కురిపించారా. తరగతి గదిలోనో, అమ్మ ఒడిలోనో ప్రశాంతంగా ఆడుకునే పసికూనలు వారు. ప్రస్తుతం గాజాలో 16 ఏళ్లలోపు చిన్నారులు 8 లక్షల దాకా ఉండొచ్చని అంచనా, వారంతా యుద్ధాన్ని, యుద్ధ వాతావరణాన్ని పత్యక్షంగా చూస్తున్న వారే, అంటే భవిష్యత్తులో వారి మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక యుద్ధంలో మరణించిన వారి తల్లిదండ్రులను మర్చిపోవటం అంత సులువైన విషయం కూడా కాదు. వారి భవిష్యత్తు ఏమిటో, వారి రక్షణ, వారి పోషణ ఎవరు చూసుకుంటారనేది ప్రశ్నార్ధకంగా మారింది. అలానే పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు కూడా మానసికంగా కుంగుబాటుకు లోనయ్యే ప్రమాదం ఉంది. గాజాలో ఈ నెల రోజుల్లోనే సుమారు 5500 మంది చిన్నారులు జన్మించినట్లు, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 50 వేల మంది గర్భిణీలు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన ‘యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌’ సంస్థ వెల్లడించింది. అంటే యుద్ధ భూమిలోనే ఒక వైపు పిల్లల మరణాలు మరో వైపు జననాలు జరగడం బాదకల్గించే విషయం. బాలింతలకు పౌష్టికాహారం మాట అటుంచితే రెండు పూటల తిండి దొరకడం కష్టంగా ఉందని ఈ పరిస్థితుల్లో శిశువులు భవిష్యత్తులో పౌష్టిక ఆహార లోపాన్ని, ఇతర రుగ్మతలను ఎదుర్కోవాల్సి వస్తుందని అలాగే యుద్ధం ద్వార వెలువడిన వివిధ రకాల రసయానాలు కూడా పిల్లలపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సర్వం కోల్పోయిన ఈ పిల్లలు భవిష్యత్తులో మళ్ళీ హింసాత్మక విధానాల వైపు మల్లే అవకాశం కూడా లేకపోలేదని మానసిక విశ్లేషకుల అంచన. ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం ఏం చేయాలనేది ప్రశ్న ఇజ్రాయిల్‌ పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తాత్కాలికంగా విరమింపజేసేలా ప్రపంచ దేశాలు ఇరు దేశాలపై ఒత్తిడి చేయాలి. విననిపక్షంలో ఆంక్షలు విధించే ఏర్పాటు చేయాలి. అంతర్జాతీయ చట్టాలకు లోబడి పాలస్తీనా వారు, ఇజ్రాయిల్‌ ప్రభుత్వం కట్టుబడి ఉండేలా ఐక్య రాజ్యసమితి చొరవ తీసుకొని శాంతి స్థాపనకు కృషి చేయాలి. 1947లో ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన 181వ తీర్మానం ప్రకారం ఇజ్రాయిల్‌ ఆక్రమించిన పాలస్తీనా భూ భాగాలను అప్పగించి యధాతద స్థితిని అమలు చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు చేపట్టాలి. ఒక వైపు ఇజ్రాయిల్‌ కు మద్దతుగా అమెరికా తన సైన్యాన్ని పంపి మరొక వైపు శాంతి చర్చల పేరిట హడావుడి చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఇజ్రాయిల్‌, పాలస్తీనాకు పొరుగు దేశాలైన అరబ్‌ దేశాలు లేదా ఇతర ప్రపంచ దేశాలు పాలస్తీనాలోని పిల్లలకు సంఘీభావంగా వారికి పౌష్టిక ఆహారం, మందులు, దుస్తులు, తాగునీరు సరైన వసతి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. తమవంతుగా సహకరించాలి కూడా. యుద్ధం ద్వారా మానవ హననం, నాగరికతా విధ్వంసం తప్ప ఏమి సాధించలేం అన్న విషయం ఇరు దేశాలు గమనించాలి.
రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంలో లక్షలాది మంది ఉక్రెయిన్‌ పౌరులు పొరుగు దేశాలకు వలసవెళ్ళిన చిత్రాలు ఇంకా కళ్ళముందు మెదులుతూనే ఉన్నారు అలాగే అఫ్ఘనిస్తాన్‌, సిరియా, లిబియా దేశాలలోని అంతర్‌ యుద్ధాలలో సరిహద్దులు దాటుతున్న పసిపిల్లలను, సముద్రాలు దాటుతూ మరణించిన పసి పిల్లల చిత్రాలను మర్చిపోలేం. అంతెందుకు 1984 డిసెంబర్‌ 3న మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌ నగరంలోని ‘యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ నుండి అర్ధరాత్రి వెలువడిన ”మిథైల్‌ ఐసోసైనడ్‌’ అనే విషవాయువును పీల్చిన పిల్లలు, పెద్దలు రాత్రికి రాత్రే నిద్రలో నుండి శాశ్వత నిద్రలోకి జారుకున్న సంఘటన అందరికీ తెలిసినదే. అది జరిగి నాలుగు దశాబ్దాలు దాటిన ఇంకా ఆ విష ప్రభావం ద్వార శారీరక మానసిక వైకల్యంతో నేటికి పిల్లలు జన్మిస్తున్నారంటే నాడు ఎంత దారుణం జరిగిందో దాని ప్రభావం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ‘మంచి వాతావరణం కల్పించలేని పాలకులు ఉన్నంత కాలం వారి హక్కుల కోసం సంఘర్షణ జరుగుతూనే ఉంటది’. గత ఎనిమిది దశాబ్దాలుగా జరుగుతున్న ఇజ్రాయిల్‌ పాలస్తీనా సమస్య ఈ యుద్ధంతోనైనా శాశ్వతంగా సమిసిపోతే ప్రపంచం సంతోషిస్తుంది. లేనిపక్షంలో ఈ యుద్ధ భూమిలో పుట్టిన పిల్లలే పెరిగి పెద్దవారై మళ్ళీ ఇజ్రాయిల్‌ పై తుపాకి ఎక్కుపెట్టరని గ్యారంటీ ఏమిలేదు. జర్మనీ నియంత ‘హిట్లర్‌’ బాల్యంలో ఓ యూదు టీచర్‌ ద్వార శిక్షింపబడి పెరిగి పెద్దవాడైన తరువాత ‘జర్మని ఛాన్సలర్‌’గా పదవిని చేపట్టి లక్షలాది యూదులను చంపిన సంఘటన చరిత్రలో చదివాం. పిల్లల్ని దైవ ప్రసాదంగా భావించే సంస్కృతి మనది అలాంటి పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు మానసికంగా కోలుకుంటారని ఊహించడం కష్టం. పిల్లల జ్ఞాపకాలు తలుచుకొని తల్లిదండ్రులు, తల్లిదండ్రుల లోటును గుర్తుచేసుకొని పిల్లలు మానసిక కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో వాళ్ళు హింసాత్మక పద్దతుల వైపు మల్లే ప్రమాదం కూడా లేకపోలేదు. అలా జరిగితే ఇజ్రాయిల్‌ పాలస్తీనా సమస్యను మరో వందేళ్ళ వరకు కూడా పరిష్కరించలేం. అందుకే మనుషుల్ని మనుషులు చంపుకోవటం కాదు, కలిసిమెలిసి జీవించే విధానాలను పాలకులు అవలంబించి పాలస్తీనీయన్లు కోరుతున్న భూభాగం వారికే అప్పగించి ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాలను ఇజ్రాయిల్‌ గౌరవించి సోదరభావంతో మసలే ప్రయత్నం చెయ్యాలి లేనిపక్షంలో భవిష్యత్తులో మళ్ళీ రెండు దేశాల మధ్య హింస చెలరేగే ప్రమాదం కూడా లేకపోలేదు.
పొరుగున ఉన్న సౌది అరేబియా దేశంతో శాంతి ఒప్పందాలు చేసుకోవాలనుకుంటున్న ఇజ్రాయిల్‌ తన ప్రక్కనే వున్న ‘పాలస్తీనా’ ప్రజలను శత్రువులుగా చూడటంలో అర్ధం లేదు. ‘హమాస్‌’ కూడా శత్రు దుర్బేద్యంగా ఉన్న ఇజ్రాయిల్‌ను కవ్విస్తే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఈ యుద్ధం ద్వారానైనా గ్రహించి శాంతి చర్చలకు మొగ్గుచూపి ప్రాణనష్టం జరగకుండా తన పట్టును వీడి బందీలుగా ఉన్న ఇజ్రాయిల్‌ పౌరులను విడిచిపెట్టాలి. ఇకనైనా రెండు దేశాలు ఒక మెట్టుదిగి హింసకు స్వస్తి పలికి ఇక ముందు కలిసిమెలిసి ప్రపంచానికి ఒక శాంతి సందేశం పంపాలి. అగ్రరాజ్యాలు లేదా అభివృద్ధి చెందిన దేశాలు చిన్న దేశాలపై పెత్తనం చెలాయించాలనుకోవడం, అణుబాంబులను పోగేసుకోవడం కన్నా వాటికి ఐన ఖర్చును పేదదేశాలలోని పసి పిల్లలకు, పాఠశాలలకు, మౌలిక సదుపాయాల కల్పనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి వారి అభివృద్ధికి పాటుపడాలి. అప్పుడే ప్రపంచంలోని అంతరాలను, పిల్లల్లోని నైపుణ్యాలను పెంపొందించి సమాజంలో వారిని కూడా భాగస్వామ్యులను చెయ్యగలిగిన వారమవుతాం. ఇజ్రాయిల్‌ పాలస్తీనా ప్రాంతాలు మూడు మతాల (యూదులు, క్రైస్తవులు, ముస్లింలు) సమాహారం అలాంటిది హింస కన్న శాంతియుతంగా జీవించే అలవాటును క్రమంగా వీరు అలవరచుకోవాలి. ఇజ్రాయిల్‌ పాలస్తీనా భూభాగాలు ప్రవక్తలైన ‘ఏసుక్రీస్తు, మహమ్మద్‌’ సంచరించిన ప్రదేశాలు అటువంటి ప్రాంతాలను యుద్ధాలతో, రక్తంతో తడపాలనుకోవడం అవివేకం. కలింగ యుద్ధంతో (క్రీస్తు శకం 261) లక్షల మందిని చంపిన అశోకుడు చివరికి భౌద్ధమతం స్వీకరించి శాంతి మంత్రం పఠించిన విషయం మనకు తెలిసిందే కదా.
డా.మహ్మద్‌ హసన్‌,
9908059234