కొన్నింటి సమ్మేళనం

అక్కడొక ప్రకతి విపత్తు
కొన్నింటిని కలుపుకుపోతూ
శూన్యంలోకి నెట్టేసింది
మనిషి పనికి సలాం కొడుతూ
గులామైపొతూ

ఒక వ్యక్తిగత కాలుష్యం
ఊపిరాడకుండా చేసింది
తనలో తాను నలిగిపోతూ
ఎక్కడికక్కడ ఆగిపోయింది

తుఫాను కెరటం ఎగసిపడి
ఒక తీరాన్ని తనలో కలిపేసుకుంది
బురదంటిన గోడలు కరిగిపోయి
ఒక కట్టడం కూలబడింది

మారుమూలన ఒక రోగం
క్రమక్రమంగా లోలోన తినేసింది
పద్ధతి మరచిన విడ్డూరమొకటి
కాలికి ముళ్ళై గుచ్చుకుంది

అనుకోని ఆటంకం
అతిథిలా వచ్చి వెళ్ళింది
కావాలనుకున్నది తిరగబడి
రక్కడానికి ప్రయత్నించింది

అక్కడొక జెండా కర్ర
గాలి వాటానికి కుప్పకూలింది
పంచభూతాల తిరుగుబాటుతనం
నెత్తిన పిడుగై రాలిపడింది

కానరాని చినుకు చుక్క
దిశలు మార్చుకుని పయనించింది
సుడిగాలి తిప్పడంలో
కార్తి కాలం దాటిపోయింది

తప్పొప్పుల బేరీజులో
సమానత కోల్పోయాక
మస్తిష్కం మసకబారింది
తికమకలతో నాలిక మడత పడింది
హతవిధీ..!!
– నరెద్దుల రాజారెడ్డి, 9666016636