నిబద్ధత గల కమ్యూనిస్టు వేగినాటి

– సంస్మరణ సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మంరూరల్‌
వేగినాటి వెంకటేశ్వర్లు నిబద్ధత గల కమ్యూనిస్టు అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లి గ్రామంలో వేగినాటి వెంకటేశ్వర్లు సంస్మరణ సభను పార్టీ నాయకులు తమ్మినేని వెంకట్రావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సభలో నున్నా మాట్లాడుతూ.. జీవితాంతం ఎర్రజెండా నీడలో మహౌన్నత విలువలతో కూడిన జీవితం గడిపిన వ్యక్తి వెంకటేశ్వర్లు అని అన్నారు. వేగినాటి కుటుంబం పేదరికంలో ఉన్నా ఎటువంటి ప్రలోభాలకూ గురికాకుండా జీవితాంతం ఎర్రజెండాను చేతబట్టి, కాలుకు గజ్జకట్టి ఎంతోమందికి తన పాట, ఆట, మాట ద్వారా చైతన్యం కలిగించిన వ్యక్తి అని కొనియాడారు. సుదీర్ఘకాలం కమ్యూనిస్టు పార్టీలో పని చేయడంతో పార్టీ వ్యవహారాల్లో అనుక్షణం బిజీగా ఉండేవారని, అయినా కుటుంబాన్ని ఇద్దరి పిల్లలను కంటికి రెప్పలా కాపాడిన ఆయన భార్య సత్యవతి జీవితం ఆదర్శనీయమన్నారు. వెంకటేశ్వర్లు మరణం సీపీఐ(ఎం)కు, ప్రజానాట్యమండలికి తీరని లోటన్నారు. వేగినాటి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్‌, వై.విక్రమ్‌ మాట్లాడుతూ.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చెదరని ఆత్మవిశ్వాసం వేగినాటి సొంతమన్నారు. సభలో పార్టీ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్‌, సర్పంచ్‌ సిద్దినేని కోటయ్య, ఆంధ్ర బ్యాంక్‌ సొసైటీ వైస్‌ చైర్మెన్‌ తమ్మినేని విజయలక్ష్మి, సీపీఐ(ఎం) నాయకులు షేక్‌ బషీరుద్దీన్‌, బోడపట్ల సుదర్శన్‌, ప్రకాష్‌, రంజాన్‌ పాషా, దోనోజు లక్ష్మయ్య, జాజుల నాగేశ్వరరావు, వేగినాటి బుచ్చి రామయ్య, యల్లంపల్లి నాగయ్య, జక్కంపూడి కృష్ణ, ప్రజానాట్యమండలి సీనియర్‌ నాయకులు అన్నాబత్తుల సుబ్రహ్మణ్య కుమార్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నామ లక్ష్మీనారాయణ, వేముల సదానంద్‌, జిల్లా నాయకులు, వేగినాటి కుమారులు భాస్కర్‌, లెనిన్‌, సోదరులు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.