– దేశం నాశనమైనా ….మోడీకి పట్టదు:సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎన్నికల కోసమే ప్రధాని నరేంద్రమోడీ ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని తెరపెకి తీసుకొచ్చారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. దేశం నాశనమైనా సరే మోడీకి పట్టదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని మగ్ధూంభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈటీ నర్సింహా, బాలనర్సింహాలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి పౌరస్మృతినీ, జీఎస్టీని వ్యతిరేకించిన మోడీ పీఎం అయ్యాక ఆ రెండింటిని సమర్థిస్తున్నారని ఎద్దేవా చేశారు. భారతదేశ చరిత్ర తెలిసి ఉంటే మోడీ కామన్ సివిల్ కోడ్ మాట ఎత్తేవారు కాదని తెలిపారు. భిన్నత్వం కలిగిన దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు నాటి నాయకులు రాజ్యాంగం తెచ్చారని తెలిపారు. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఎన్నికలకు ముందు ఏదో ఒక భావోద్వేగ అంశాన్ని లేవనెత్తడం, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. ఇటీవల వరుస ఓటమి, కేంద్ర స్థాయిలో బీజేపీని నిలువరించేందుకు 15 పార్టీలతో ఐక్య సంఘటనగా ప్రతిపక్షాల ప్రయత్నాలు మొదలు పెట్టా యని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గట్టేక్కేం దుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని చెప్పారు. మణిపూర్ లో విద్వేషపూరిత రాజకీయాలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీలంకకు నారాయణ
శ్రీలంక కమ్యూనిస్టు పార్టీ 80వ మహాసభలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయని నారాయణ తెలిపారు. ఈ సభలకు సీపీఐ తరుపున తాను హాజరువుతున్నట్టు చెప్పారు.