ప్రజల ఐక్యతను దెబ్బతీసేలా కేంద్రం కుట్ర

A conspiracy by the Center to undermine the unity of the people– మతం, కులం, ప్రాంతం, భాషల పేరుతో విద్వేషం
– ఐక్యపోరాటాలతోనే హక్కుల్ని కాపాడుకోగలం
– దళారులు, వ్యాపారులకు లాభాలు…ప్రజలపై భారాలు : సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత
– మగ్గమున్న ప్రతి కార్మికునికీ  10 లక్షల చేనేత బంధు ఇవ్వాలి
– వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలి
– జాతీయ చేనేత సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి : చెరుపల్లి సీతారాములు ,
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే కుట్రకు మోడీ సర్కారు పూనుకున్నదనీ, దానికి భావోద్వేగపరమైన మతం, కులం, ప్రాంతం, భాషల పేరుతో ప్రజల్లో విద్వేషం నింపుతున్నదని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత విమర్శించారు. దీన్ని తిప్పికొట్టేందుకు ఉత్పాదక రంగంలో అత్యంత కీలకమైన కార్మికులు, రైతులు ఒక్కతాటిపైకి వచ్చి పోరాటాలు చేయడం మంచి పరిణామం అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ, చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత హ్యాండ్‌లూమ్‌(చేనేత) కార్మికుల కన్వెన్షన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణపతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కన్వెన్షన్‌ను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ..కేంద్రంలోని పాలకులు దేశంలో వస్త్రమిల్లుల యజమానులకు లాభాలు గడించి పెట్టేందుకు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్న తీరును వివరించారు. మోడీ సర్కారు వచ్చాక శాశ్వత పనివిధానం పోయి డైలీవేజ్‌, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు పని పద్ధతుల అమలు వేగవంతం అయిందన్నారు. దీంతో యాజమాన్యాలు కార్మికులను అణచి ఉంచి పనిచేయించుకుంటున్నాయన్నారు. రాజ్యాంగం కార్మికులకు ఇచ్చిన హక్కులను కూడా మోడీ సర్కారు కాలరాస్తున్నదన్నారు. మరోవైపు వ్యవసాయాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసిందన్నారు. పేదలపై ధరల భారాలు మోపుతున్న సర్కారు అదే సమయంలో కార్పొరేట్లకు మాత్రం లాభాలు మరింత పెరిగేలా చేస్తున్నదని విమర్శించారు. దేశంలో ధరలు పెరగటం, తగ్గడం అనే అంశం కేవలం ఐదుగురు పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉందని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓవైపు స్వదేశీ జపం చేస్తూనే మరోవైపు దేశ సంపదను విదేశీ గుత్తపెట్టుబడిదారులకు దోచిపెడుతున్నదని విమర్శించారు. అమెరికా నుంచి ఆపిల్స్‌ను దిగుమతి చేసుకోవడమంటే కాశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రైతుల ఉపాధిని దెబ్బతీయడమేనన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టడాన్ని అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అదే పెద్దపెద్ద కంపెనీలకు మాత్రం వేట చేసే అవకాశం కల్పించడం దుర్మార్గమన్నారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ..తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చేనేత కార్మికులు పోషించిన పాత్రను వివరించారు. నేతన్నల హక్కుల కోసం చేనేత కార్మిక సంఘం చేసిన పోరాటాలను, సాధించిన విజయాలను గుర్తుచేశారు. నేడు రాష్ట్రంలో అమలవుతున్న పింఛన్‌ స్కీమ్‌ చేనేత కార్మిక సంఘం పోరాట ఫలితమేనన్నారు. రాష్ట్రంలో ఒకనాడు 1.50 లక్షల మగ్గాలుండగా పాలకుల తీరు వల్ల నేడు 40 వేల లోపునకు పడిపోయాయని చెప్పారు. ప్రభుత్వం జియో ట్యాగింగ్‌ ద్వారా గుర్తించినవి 30 వేల మగ్గాలే ఉన్నాయన్నారు. ఉన్న మగ్గాలను కాపాడుకునేందుకు చేనేత కార్మికులందరూ ఒక్కతాటిపైకి వచ్చి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో హ్యాండ్‌లూమ్‌, పవర్‌లూమ్‌ రంగాలకు వేర్వేరుగా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. జాతీయ స్థాయిలో చేనేత సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరారు. చేనేత వస్త్రాలపైనా, బట్ట తయారీకి అవసరమయ్యే ముడిసరుకులపైనా 34 శాతం జీఎస్టీ విధించడం దారుణమన్నారు. ఇది చేనేత రంగాన్ని దివాళా తీయించడంలో భాగమేనన్నారు. చేనేతపై జీఎస్టీని ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. వస్త్ర తయారీ ముడిసరుకులను ప్రభుత్వమే సబ్సిడీ మీద అందించాలని కోరారు. రాష్ట్రంలో మగ్గమున్న ప్రతి కార్మికునికీ రూ.10 లక్షల చేనేత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పోచంపల్లి ఇక్కత్‌, టై అండ్‌ డైకి పేటెంట్‌ హక్కులున్న నేపథ్యంలో మిల్లుల్లో తెల్లబట్టపై ఆ ప్రింటింగ్‌ వేయడాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఆ డిజైన్లను కాపీ కొట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. ప్రతి కార్మికునికీ రూ.10 వేల పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ..రాష్ట్రంలో చేనేత వెల్ఫేర్‌ బోర్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 73 షెడ్యూల్‌ పరిశ్రమల్లో చేనేత రంగమూ ఉందనీ, కనీస వేతనాల జీవోలను వెంటనే విడుదల చేసి నేతన్నలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ జాతీయ కార్యదర్శి కరిమలయన్‌, జాతీయ నాయకులు ఆర్‌.సింగారవేలు, ఎ.బాలన్‌, బాలకృష్ణ, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు శాంతికుమార్‌, సలహాదారులు కూరపాటి రమేశ్‌, సంఘం మాజీ నాయకులు శాంతారావు, తదితరులు పాల్గొన్నారు.