సరెండరా…సమదూరమా?

Surendara...equal distance?– ఎంఐఎంతో దోస్తానా సరే…బీజేపీ పట్ల బీఆర్‌ఎస్‌ వైఖరేంటి?
– బీఆర్‌ఎస్‌ అధినేత వైఖరిపై సర్వత్రా చర్చ
– గుడిగ రఘు

‘బీజేపీ దేశానికి పట్టిన పీడ… కేంద్రంలో ఆ పార్టీ ఓడిపోతేనే దేశం బతికి బట్టకడుతుంది’ నిన్నమొన్నటి వరకు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు జాతినుద్దేశించి చేసిన ప్రసంగమిది.
బీజేపీని ఓడించేందుకు, దాన్ని ఏకాకిని చేసేందుకు దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రణాళికలు రచించారు. కానీ కొంత కాలంగా ఆయనలో, పార్టీ ముఖ్య నేతల్లో వచ్చిన మార్పు విస్మయానికి గురి చేస్తున్నది. ఇటీవల ఆ పార్టీ ఇంటా, బయటా నిర్వహించిన బహిరంగ సభల్లో కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. బీజేపీని పల్లెత్తు మాట అనేందుకూ సాహ సించట్లేదు. హిందు త్వ అజెండాతో దూకుడు ప్రదర్శిస్తూ, నిత్యం వివా దాస్పదుడిగా మారిన బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరును ఆ పదవి నుంచి బీజేపీ అధిష్టానం తప్పించినప్పుడే బీజేపీ- బీఆర్‌ఎస్‌ దోస్తానా వెల్లడైందని ఇరు పార్టీల్లోనూ చర్చ జరిగింది. సీఎం కేసీఆర్‌కు నమ్మకస్తుడైన కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డికి బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టగానే దోస్తానా ఖరారైందనే ప్రచారం పీక్‌ స్టేజ్‌కి వెళ్లింది.ఈ సయోధ్య ఫలితంగానే లిక్కర్‌ స్కాంలో కవిత విచారణ మందగించిన విషయమూ వాస్తమేనని బీఆర్‌ఎస్‌లోనూ చర్చ జరగుతోంది.
కమ్యూనిస్టులతో కటీఫ్‌
మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం…కాంగ్రెస్‌ మునిగిపోతున్న నావ అని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు మాట మార్చారనేదానిపై స్పష్టత ఇంకా రాలేదు. మునుగోడు ఎన్నికల టైంలో కమ్యూనిస్టులతో కలిసి ఒకే వేదిక పంచుకుని, తమ బంధం భవిష్యత్‌లోనూ కొనసాగుతుందని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఏకపక్షంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించి, ‘అన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించాక ఇక పొత్తులేంది? అని ముక్తసరి సమాధానంతో సరిపుచ్చారు. అదే సమయంలో ఇప్పటి వరకు బీజేపీపైనా, మోడీపైనా ప్రదర్శించిన దూకుడును కొనసాగిస్తారో లేదో స్పష్టత ఇవ్వలేదు. టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చి, జాతీయ పార్టీగా ప్రకటించి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు సమదూరంగా ఉంటామంటూ గర్జించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు బీజేపీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాజ్‌భవన్‌పై అనుమానాలు తీరాయా?
దేశ వ్యాప్తంగా పోటీ చేసి మతతత్వ బీజేపీని ఓడించి సత్తా ఏంటో చూపిస్తామంటూ కేసీఆర్‌ హడావుడి చేశారు. ‘అబ్‌ కీ బార్‌…కిసాన్‌ సర్కార్‌’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రానికే పరిమితమైనట్టు తెలుస్తున్నది. పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా సీఎం, గవర్నర్‌ మధ్య ఏర్పడిన అగాధం పూడిపోయినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ మరుసటి రోజే కొత్త సచివాలయంలోని గుడి, చర్చి, మసీదును సీఎం కేసీఆర్‌ గవర్నర్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో బీజేపీకి, బీఆర్‌ఎస్‌ మరింత దగ్గరవుతున్నదనే సంకేతాలు వెలువడ్డాయి.
ఇక్కడ మేమే…అక్కడ మీరే..!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం కోసం బీజేపీ సహకరించేలా…పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీకి సహకరించేలా రెండు పార్టీల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడొక్క చిక్కు ప్రశ్న కూడా ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎంఐఎం పార్టీతో బీఆర్‌ఎస్‌ ప్రెండ్లీ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నది. మరోవైపు బీజేపీతో స్నేహం కొనసాగించేందుకు సిద్ధమవుతున్నది. ఎంఐఎం, బీజేపీ రెండూ మతతత్వంతో కూడిన భిన్న ధృవాలు. ఆ రెండు పార్టీలతో స్నేహం కొనసాగించడం కారును ప్రమాదాలకు గురి చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో బీఆర్‌ఎస్‌ కీలకంగా మారబోతున్నదని మంత్రి కేటీఆర్‌ చెప్పడంతో ఈ రెండు పార్టీల మధ్య బంధం బలపడుతున్నదనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.
బీజేపీ సభకు ఆర్టీసీ బస్సులు..
ఖమ్మం సభావేదికగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ దోస్తీ బట్టబయలు అయ్యింది. గతంలో ఖమ్మంలో కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘జనగర్జన’ సభకు కేసీఆర్‌ సర్కార్‌ ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు. పైగా పొంగులేటి అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలిరాగా వారిని ఎక్కడికక్కడ అడ్డుకోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆదివారం అమిత్‌ షా సభకు మాత్రం పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులు తరలివెళ్లాయి. బీజేపీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఆర్టీసీ బస్సులు ఇచ్చింది. ఇలా చేయడం బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య దోస్తీ ఉన్నట్టు కాదా? అసలు ఇదంతా దేనికి సంకేతం..? అని కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తోంది. గత కొన్ని రోజులుగా బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందని.. దోస్తీగా మెలుగుతున్నాయని కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలు నిజమేనని ధృవీకరిస్తున్నట్టే ఉంది. రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు ప్రజల్లో మరింత చర్చను రేకెత్తిస్తుండటం గమనార్హం!

Spread the love