రష్యాలో తేలిపోయిన తిరుగుబాటు

– గంటల వ్యవధిలోనే పరార్‌ బెలారుస్‌లో ఆశ్రయం పొందిన ప్రిగోజిన్‌
నెల్లూరు నరసింహారావు
యూజెనీ ప్రిగోజిన్‌..”వ్యాగర్‌’‘ అనే ఒక రష్యన్‌ కిరాయి సైన్యానికి అధిపతి. ఈ కిరాయి సైన్యం ఉక్రెయిన్‌ యద్ధంలో రష్యా తరఫున ప్రముఖంగా పాల్గొంటోంది. అలాంటిది శుక్రవారం సాయంత్రం రష్యా పైనే తన సాయుధ తిరుగుబాటును ప్రకటించింది. ప్రిగోజిన్‌ కేవలం 30 నిమిషాల వీడియోని విడుదల చేయటం ద్వారా ఈ తిరుగుబాటును ప్రకటించాడు. ఈ వీడియోలో రష్యన్‌ సైనిక నాయకత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన విమర్శలు చేయటమే కాకుండా రష్యన్‌ పాలక వర్గంలోని నాటో అనుకూల గ్రూపు మద్దతును కోరుతున్నట్టు చెప్పాడు. ఇలా శుక్రవారం సాయంత్రం మొదలైన సైనిక తిరుగుబాటు శనివారం సాయంత్రంకల్లా అంతం అయింది. బెలారుస్‌ అధ్యక్షుడు, అలెగ్జాండర్‌ లుకషెంకో మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రిగోజిన్‌ రష్యాను వదిలి బెలారుస్‌ లో ఆశ్రయం పొందాడు. రష్యన్‌ రహస్య సర్వీస్‌(ఎఫ్‌ఎస్‌బీ) ప్రిగోజిన్‌ తిరుగుబాటుపైన మొదలెట్టిన విచారణను నిలిపివేసింది.
శనివారం ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాడీమీర్‌ పుతిన్‌ టెలివిజన్‌ లో ప్రసంగిస్తూ ప్రిగోజిన్‌ నాటో కుట్రలో భాగంగా వ్యవరిస్తున్నాడని అన్నాడు. ”నేడు రష్యా తన భవిత కోసం నియో నాజీలు, వారి మద్దతుదార్లతో భయంకరమైన పోరాటం చేస్తున్నది. పశ్చిమ దేశాల యావత్‌ సైన్యం, ఆర్థిక, సమాచార యంత్రాంగం అంతా మనకు వ్యతిరేకంగా సమీకరించబడ్డాయి” అని పుతిన్‌ పేర్కొన్నాడు. శనివారం సాయంత్రంకల్లా తాము ఆక్రమించిన రోస్తోవ్‌-ఆన్‌-డోన్‌ సైనిక కేంద్ర కార్యాలయాన్ని వ్యాగర్‌ సైన్యం వీడనున్నదని ప్రిగోజిన్‌ ప్రకటించాడు.
తిరుగుబాటుకు కారణాలు
ప్రిగోజిన్‌ అసలు తిరుగుబాటు ఎందుకు చేశాడు?అనే ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుదాం. మొదటి కారణమేమంటే.. రష్యా ప్రభుత్వ, సైనిక యంత్రాంగంతో ఆయన పడుతున్న ఘర్షణ పతాక స్థాయికి చేరుకుంది. తిరుగుబాటు ప్రారంభానికి ముందు యుద్ధాన్ని తగినంత తీవ్ర స్థాయిలో నడపటం లేదని ఆయన రష్యా రక్షణ మంత్రి షోయిగు పైన ఆరోపణలను గుప్పించాడు. వ్యాగర్‌ కు చేసిన నిధుల కేటాయింపులో గణనీయంగా కోత విధించటం జరిగిందనేది మరో ఆరోపణ. ఈ నెల మొదట్లో వ్యాగర్‌ దళాలు రష్యా సైనిక నాయకత్వం నియంత్రణలో పనిచేయాలని పుతిన్‌ చేసిన సూచనను ప్రిగోజిన్‌ తిరస్కరించాడు. దీర్ఘకాలంగా పుతిన్‌ ఆశ్రయం పొందిన ప్రిగోజిన్‌ సైన్యంపట్ల దురుసుగా వ్యవహరిస్తుండటంతో సైనికాధికారులు విసుగుచెందారు. ఉక్రెయిన్‌ లో వ్యాగర్‌ దళాలు కొంత వరకు ఉపయోగపడినా సైనికాధికారుల యుద్ధ నిర్వహణలో ప్రిగోజిన్‌ జోక్యం ఎక్కువైంది. తనకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుండా ఉండటం కోసం ప్రిగోజిన్‌ ఈ సైనిక తిరుగుబాటుకు ప్రయత్నించాడు. రెండో కారణం: గత 24 నుంచి 36 గంటల కాలంలో నాటో ఏమీ చేయకుండా చోద్యం చూస్తూ ఉందని అనుకోవటమంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. నాటో కూటమి ప్రిగోజిన్‌ తో సంపర్కంలో ఉందనేది సుస్పష్టం. ఈ తిరుగుబాటు జరిగిన కాలంలో ప్రిగోజిన్‌ నాటో అనుకూల ధోరణిని వ్యక్తం చేయటాన్ని మరోలా వివరించటం కుదరదు. తిరుగుబాటుకు ఇదే తగిన సమయమని ప్రిగోజిన్‌ తో సంపర్కంలోవున్న నాటో వర్గాలు సూచించి ఉంటాయి. ఉక్రెయిన్‌ ప్రతిదాడి మొదలయిన మూడు వారాలలోపే ఈ తిరుగుబాటు జరిగింది. ఉక్రెయిన్‌ రష్యాపైన చేస్తున్న ఈ ప్రతిదాడి సంసిద్దతకు వందల కోట్ల డాలర్ల వ్యయం చేసినప్పటికీ ఇప్పటికే ఉక్రెయిన్‌ సైనికులు వేలాదిగా చనిపోయారు. రష్యాతో తలపడిన ఉక్రెయిన్‌ ప్రతి రంగంలో మట్టిగరిచింది. పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా, జర్మనీలు ఉక్రెయిన్‌ కు అందించిన ప్రతి ఆయుధాన్నీ రష్యా నిర్వీర్యం చేసింది.మరో రెండు వారాల్లో విల్నియస్‌లో నాటో శిఖరాగ్ర సభ జరగనుంది. ఈ సభలో రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో ఉక్రెయిన్‌ దారుణ వైఫల్యం ప్రధాన చర్చనీయాంశం కానుంది. అయితే ఈ తిరుగుబాటుతో అటువంటి చర్చ పక్కకుపోయే అవకాశం ఉంది. ఇటువంటి తిరుగుబాటు విజయవంతం కాకపోయినప్పటికీ రష్యన్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తుందని, రష్యన్‌ సైనిక చర్యను బలహీనపరుస్తుందని అమెరికా, నాటో దేశాలు భావించాయి. ఈ తిరుగుబాటు తమను ఆశ్చర్యపరచలేదని అమెరికన్‌ సామ్రాజ్యవాద ప్రతినిధులు, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తమ తక్షణ స్పందనలో పేర్కొన్నారంటేనే ఈ తిరుగుబాటు వెనుక అత్యున్నత స్థాయిలో నాటో దేశాల పాత్ర ఉన్నదనేది సుస్పష్టం. అయితే ఈ కిరాయి సైనిక తిరుగుబాటు కేవలం సీఐఏ కుట్రతో మాత్రమే జరిగిందనుకోవటమంటే రష్యా ప్రభుత్వంలోని వాస్తవ విభజనరేఖల్ని, విధానాలను నిర్ణయించే సామాజిక ప్రయోజనాలను విస్మరించటం అవుతుంది.ప్రిగోజిన్‌ కిరాయి సైనిక తిరుగుబాటు అన్నింటికీ మించి పుతిన్‌ పాలనావైఫల్యానికి ప్రతీకగా ఉంది. ఈ వైఫల్యం నుంచే ప్రిగోజిన్‌ ఆవిర్భవించాడు. తాను సృష్టించిన దుష్టశక్తిపైనే పుతిన్‌ తన నియంత్రణ కోల్పోవటం ఇక్కడ వైచిత్రి. అనేక దశాబ్దాలుగా పుతిన్‌, ప్రిగోజిన్‌ ప్రాణమిత్రులు. రష్యన్‌ మిలిటరీ ఇంటెలిజెన్స్‌ నుంచి ఆవిర్భవించిన వ్యాగర్‌ గ్రూపు పట్ల పుతిన్‌కు, ప్రభుత్వ యంత్రాంగంలోని ఇతర బలమైన శక్తులకు ఆశ్రిత పక్షపాతం ఉండేది. ప్రిగోజిన్‌ సంపన్నుడు. రష్యాలోని పెట్టుబడిదారీ వ్యవస్థను, రష్యా సహజ వనరులను రక్షించటానికి పుతిన్‌ చేస్తున్న ప్రయత్నంతో తాము నష్టపోతున్నామని రష్యాలోని సంపన్నవర్గం(ఒలిగార్క్స్‌) భావిస్తోంది. రష్యాలో పుతిన్‌ నాయకత్వంలోని పెట్టుబడిదారీ వ్యవస్థకు, ఒలిగార్క్‌ లని పిలువబడుతున్న సంపన్న వర్గానికి మధ్య సమతౌల్యం అప్పుడప్పుడూ దెబ్బతింటూ ఉంటుంది. అలా దెబ్బతిన్నప్పుడు అనేక మంది సంపన్నులు రష్యాను వీడి ఐరోపా దేశాలలో తలదాచుకుంటున్నారు. మొదటి నుంచీ ఉక్రెయిన్‌ విషయంలో కొద్దిపాటి సైనిక ఒత్తిడితో రష్యా భద్రతకు సంబంధించిన సమస్యలను పశ్చిమ దేశాలు పట్టించుకుంటాయని రష్యా భావించింది. నాటో కూటమి దేశాలు ఎన్ని హద్దులు దాటినా ఇదే విధానాన్ని రష్యా కొనసాగించింది. నేడు అది పుతిన్‌ ను గద్దె దించే వరకు వచ్చింది. ఈ సైనిక తిరుగుబాటుతోనైనా అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదంపట్ల రష్యా ఎంత వరకు అప్రమత్తం అవుతుందనేది, రష్యా అంతర్గత వైరుధ్యాలను పుతిన్‌ ఎలా సమతౌల్యంలో ఉంచుతాడనేది తెలియాలంటే వేచిచూడవలసిందే.
రష్యాకు వెనిజులా, నికరాగ్వా మద్దతు
వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో, నికరాగ్వా అధ్యక్షుడు డేనియల్‌ ఒర్టెగా రష్యాకు మద్దతు ప్రకటించారు. రష్యాలో వ్యాగర్‌ గ్రూపు సాయుధ తిరుగుబాటును ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. హింసాత్మక మరియు రాజ్యాంగ విరుద్ధ మార్గాల ద్వారా అధికార మార్పు లేదా సాయుధ తిరుగుబాటును తాము తిరస్కరిస్తామని వెనిజులా ప్రకటనలో పేర్కొన్నది. రష్యా సార్వభౌమాధికారం, స్వయం నిర్ణయాధికారంపై దాడి చేయడాన్ని తిరస్కరిస్తున్నామని అందులో వివరించింది. వెనిజులా అధ్యక్షుడు సహా పలువురు ప్రతినిధులు ఈ ప్రకటనను తమ ట్విటర్‌ ఖాతాల్లో పోస్ట్‌ చేశారు. శాంతి, స్థిరత్వం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగిన ఈ దాడిని ఎదుర్కొనేందుకు రష్యా ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులు రష్యా ప్రతిష్ట, స్వభావం, విలక్షణత, బలానికి సవాళ్లు ఎదురవుతున్నట్టున్నాయని నికరాగ్వా అధ్యక్షుడు ఒర్టెగా తెలిపారు.