వైఫల్యం

వైఫల్యంఅది దేశ చట్టసభ సభ్యులు సమావేశమయ్యే చోటు. అత్యున్నత చట్టాల రూపకల్పన జరిగే ప్రదేశం. కాబట్టి.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండొచ్చని అంతా భావించడం సహజం. కానీ, రెండు దశాబ్దాల కిందట పార్లమెంట్‌ మీదే జరిగిన ఉగ్రదాడి భారత్‌కు భద్రతా నిర్వాహణలో మాయని మచ్చని మిగిల్చింది. మళ్లీ అదే తేదీన, కొత్తగా హైటెక్‌ హంగులతో తీర్చిదిద్దిన పార్లమెంట్‌లో అలాంటి అలజడే చెలరేగింది. ఏకంగా దిగువ సభ లోపల ఆగంతకులు దాడికి దిగడంతో ‘పార్లమెంట్‌లో భద్రత మరోసారి’ ప్రశ్నార్థకంగా మారింది.
ప్రధాని సహా ప్రజాప్రతినిధులందరూ సమావేశమయ్యే ప్రాంగణంలో చోటుచేసుకున్న ఈ ఘటన యావత్‌ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. 2001 నాటి చేదు జ్ఞాపకాలను ఈ దురంతం మళ్ళీ గుర్తుచేసింది. అప్పట్లో పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదులు మన పార్లమెంట్‌పై తుపాకులతో దాడికి తెగబడితే, ఈసారి సందర్శకులుగా వచ్చిన ఇద్దరు భారతీయ సాధారణ యువకులు లోక్‌సభ సభాంగణంలోకి దూకి, రహస్యంగా తెచ్చిన పొగగొట్టాలతో అలజడి రేపారు. సభ వెలుపల రంగుల పొగతో మరో ఇద్దరు నిరసన పూర్వక నినాదాలకు దిగారు. ఇంతకు నలుగురు తీవ్రవాదులా అంటే.. కాదు, మధ్య, దిగువ తరగతి నిరుద్యోగులు. భగత్‌సింగ్‌ అభిమానులంటున్న వీరంతా దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా ఒక్కటయ్యారు, ఆరు డిగ్రీలు చేసి, లెక్చరర్‌ ఉద్యోగానికి ‘నెట్‌’ సైతం క్వాలిఫై అయిన నిరుద్యోగ హర్యానా యువతి నీలమ్‌. కంప్యూటర్‌ ఇంజ నీరైన మైసూర్‌ నిరుద్యోగి మనోరంజన్‌. ఆర్మీలో చేరాలని ఆరాటపడి విఫలమైన అమోల్‌. లక్నోకు చెందిన ఇ-రిక్షా కార్మికుడు సాగర్‌ శర్మ. బహుశా అస్తవ్యస్త పరిపాలన, నిరుద్యోగ సమస్యలాంటివే వారందరిని ఐక్యం చేసి ఉండవచ్చు. వారి నినాదాల ద్వారా నిరుద్యోగం, మణిపూర్‌ అల్లర్లు, రైతు వ్యతిరేక చట్టాలు వంటి అంశాలను దేశం దృష్టికి తీసుకురావడానికే ఈ దుస్సాహసానికి దిగినట్టు అర్థమవుతుంది. అలజడి సృష్టించిన వారు హిందువులు కాబట్టి సరిపోయింది. మరే మతస్థులై ఉంటే దేశం ఈపాటికే రావణకాష్టంలా మండుతుండేది.
అయితే, ఆ నలుగురినీ కఠినమైన ‘ఉపా’ చట్టం కింద అరెస్ట్‌ చేసి పోలీస్‌ కస్టడీకి పంపారు. భద్రతా వైఫ్యలమంటూ ఎనిమిది మంది సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. కానీ, వారికి పాసులు జారీ చేసిన అధికార పార్టీ ఎంపీని మాత్రం ఇప్పటికీ పల్లెత్తు మాటనలేదు. పైగా స్పీకర్‌ను కలిసి వివరణ ఇచ్చిన సదరు ఎంపీ కనీసం పశ్చాతాపాన్ని కూడా వ్యక్తం చేయకపోగా, వారేవరో నాకు తెలియదంటూ చేతులు దులుపుకోవడం విస్తుగొలుపుతుంది. ఒక్కపక్క అమెరికా నుంచి ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌ వంత్‌ సింగ్‌ పన్నూ పార్లమెంట్‌పై దాడి చేస్తామని హూంకరిస్తున్న నేపథ్యంలో బుధవారం పార్లమెంట్‌ వద్ద ఎంత అప్రమత్తంగా ఉండాలి! అంచెలంచెల తనిఖీని దాటుకొని, ఆ నలుగురూ పొగగొట్టాలతో లోపలికి వచ్చారంటే మన తనిఖీ, నిఘా వ్యవస్థలు నిద్రిస్తున్నట్టేగా!
అధికారపార్టీ ఎంపీ నుంచి ఈ నిరసనకారులకు పాసులు జారీ కావడం ఒక ఎత్తయితే, వెంటపడి పాసులు తీసుకున్న వారి కనీస వివరాలు సైతం నా దగ్గర లేవంటున్న సదరు ఎంపీ నిర్లక్ష్యాన్ని ప్రతి పక్షాలు తప్పుబడుతున్నాయి. పార్లమెంట్‌ సహా ఢిల్లీ భద్రత మొత్తం చేతిలో ఉండే కేంద్రహోంమంత్రి ఈ మొత్తం ఘటనపై సభలో ప్రకటన చేయాలని అన్ని పక్షాలు పట్టుపడుతున్నాయి. కానీ, జవాబివ్వాల్సిన అధికారపక్షం మొండికేయడమే గాక, ప్రశ్నించిన పాపానికి ఒక రాజ్యసభాసభ్యుని సహా14 మంది ప్రతిపక్ష ఎంపీల శీతకాల సమావేశాలు ముగిసేవరకు ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. సభలోనే కాదు ఢిల్లీలోనే లేని ఓ ప్రతిపక్ష ఎంపీ పేరు సైతం అందులో చేర్చి, తీరా రచ్చకెక్కేసరికి ‘అది క్లరికల్‌ మిస్టేక్‌’ అని సింపుల్‌గా చెప్పేసింది. కేవలం భద్రత విషయంలోనే కాదు.. సభా నిర్వహణలోనూ సర్కార్‌ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. ఒకవేళ వచ్చింది ‘తీవ్రవాదులై’ ఉంటేనో? వారు పొగగొట్టాలు కాక, ఏ మారణాయుదాలో, విషవాయువులో తీసుకువచ్చి ఉంటే పరిస్థితేంటి? ఆ ఆలోచనే వెన్నులో వణుకు పుట్టిస్తుంది.
శత్రు దుర్భేద్యమని ప్రధాని పదేపదే చెప్పిన కొత్త పార్లమెంట్‌ భవనంలోనే ఇంతటి ఘటన జరగడం శోచనీయం. కాగా, ఏమాత్రం జవాబుదారీతనం లేని సర్కార్‌ తీరు అవాంఛనీయం.
”పైపై సొగసులు కల్ల సుమా
లోపలిదంతా డొల్ల సుమా
నిజం తెలియమని నేనంటాను
లేదా కొంపే గుల్ల సుమా” అంటూ కొన్ని దశాబ్దల క్రితం దాశరథి రాసిన ఈ పద్యం ప్రస్తుతాన్నికి సరిగ్గా సరిపోతుంది. ఈ అత్యంత ఆధునాతన భవనం సైతం గతకాలపు తప్పిదాలు పునరావతం కాకుండా నిలువరించ లేకపోయింది. పోలీసు, ఇంటలిజెన్స్‌ సహా పార్లమెంటు భద్రతకు పూచీపడే సమస్త వ్యవస్థల వైఫల్యం కారణంగా, అప్పటి దురాగతాన్ని గుర్తుచేస్తూ, అదే రోజున దేశం మరోమారు ఈ ఘటనను చవిచూడాల్సి వచ్చింది. దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేసి, దేశ ప్రజలకు నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత కేంద్రానిదే.