బంగారం డిమాండ్‌లో పతనం

– అమ్మకాల్లో 7 శాతం పతనం
ముంబయి : అధిక ధరలతో ప్రజల ఆదాయాలు పడిపోవడానికి తోడు హెచ్చు బంగారం ధరల నేపథ్యంలో దేశంలో పసిడికి డిమాండ్‌ తగ్గింది. ముఖ్యంగా రికార్డ్‌ స్థాయికి చేరిన పసిడి ధరలు అమ్మకాలను దెబ్బతీస్తున్నాయి. వాల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ రిపోర్ట్‌ ప్రకారం.. ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌ – జూన్‌ త్రైమాసికంలో భారత్‌లో బంగారం అమ్మకాలు 7 శాతం పతనమై 158.1 టన్నులకు తగ్గాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 170.7 టన్నుల డిమాండ్‌ చోటు చేసుకుంది. ఇటీవల ఆర్బీఐ రూ.2వేల నోట్లను ఉపసంహరించుకోవడం కూడా పసిడి అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపిందని డబ్ల్యూజీసీ పేర్కొంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో బంగారం డిమాండ్‌ 271 టన్నులుగా అంచనా వేసింది. 2023 సంవత్సరంలో మొత్తంగా డిమాండ్‌ 650 నుంచి 750 టన్నుల మధ్య వరకు ఉండొచ్చని తెలిపింది. ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. మంగళవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.160 పెరిగి రూ.60,440గా నమోదయ్యింది. 22 క్యారెట్ల ధర రూ.150 పెరిగి రూ.55,400గా పలికింది. కిలో వెండిపై రూ.1000 పెరిగి రూ.81వేలుగా నమోదయ్యింది.