అపార్టుమెంట్‌లో అగ్నిప్రమాదం

Fire Accident – తొమ్మిది మంది మృతి
– మృతుల్లో ఆరుగురిది ఒకే కుటుంబం
– పలువురికి తీవ్ర అస్వస్థత
– సెల్లార్‌లో అక్రమంగా నిల్వచేసిన రసాయనాలే ప్రమాదానికి కారణం
– ఘటన స్థలాన్ని సందర్శించిన మంత్రులు
– కెమికల్‌ డబ్బాల వల్లనే ఇంత తీవ్రత : అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ
నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌/మెహిదీపట్నం/సిటీబ్యూరో
హైదరాబాద్‌ నడి బొడ్డులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నివాస సముదాయంలో అక్రమంగా నిల్వచేసిన రసాయనాలు పేలిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. అపార్ట్‌మెంట్‌లోని పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదంలో చిక్కుకున్న 21 మందిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నాంపల్లి ప్రాంతంలోని బజార్‌ఘాట్‌కు చెందిన వ్యాపారవేత్త రమేష్‌ జైశ్వాల్‌కు చెందిన బాలాజీ రెసిడెన్సీ (జీ ప్లెస్‌ ఫోర్‌) నాలుగు అంతస్తుల భవనంలో సోమవారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో అనుమానస్పదంగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో అక్కడ అక్రమంగా ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన బెంజీన్‌ నైట్రేట్‌ ద్రావణానికి మంటలు అంటుకోవడంతో నిమిషాల వ్యవధిలోనే నాలుగు ఫ్లోర్లకు వ్యాపించాయి. మండే గుణం కలిగిన రసాయనాలు కావడంతో మంటల తీవ్రతతో పాటు దట్టమైన పొగలు కమ్మేయడంతో అపార్ట్‌మెంట్లో నివాసం ఉంటున్నవారు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. అయితే అప్పటికే మెట్ల మార్గంలో నల్లటి పొగలు కమ్మేయడంతో ఎటు వెళ్లాలో అర్ధంకాక అయోమయానికి గురయ్యారు. రక్షించాలంటూ ఆహాకారాలు చేస్తూ అటూ ఇటూ పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసు, అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్‌ఎంసీకి చెందిన డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. అతికష్టంమీద భవనం లోపలికి వెళ్లిన రెస్క్యూ టీం మొదటి, రెండు అంతస్తుల్లో ఆపస్మారక స్థితిలో ఉన్న తొమ్మిది మందిని కిందకి దించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మంటల్లో చిక్కుకుని బయట పడిన 21 మందిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో కార్లు, పలు ద్వి చక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. కాగా, బజార్‌ఘాట్‌కు చెందిన వ్యాపారవేత్త రమేష్‌ జైస్వాల్‌కు ప్లాస్టిక్‌ వస్తువులు తయారు చేసే కర్మాగారం ఉంది. బాలానగర్‌లో కర్మాగారం ఉండగా తమిళనాడుకు చెందిన ‘డాన్‌ కంపెనీ’ పేరుతో ఉన్న కెమికల్స్‌ను తీసుకొచ్చిన రమేష్‌ బజార్‌ఘాట్‌లోని తన ‘బాలాజీ రెసిడెన్సీ’లోని సెల్లార్‌లో 150 డ్రమ్ముల్లో నిల్వచేశాడు. ప్రస్తుతం రమేష్‌ జైస్వాల్‌ పరారీలో ఉన్నారు.
కెమికల్‌ డబ్బాల వల్లనే ఇంత తీవ్రత : అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ
ఈ ఘటనలో సెల్లార్‌లో కెమికల్‌ డబ్బాలు ఉంచడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగిందని తెలంగాణ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 9.34 గంటలకు ఫైర్‌ కాల్‌ వచ్చిందని, వెంటనే జూబ్లీహిల్స్‌, గౌలిగూడ, సాలార్‌జంగ్‌ మ్యూజియం, యాకత్‌పుర సహా మొత్తం 7 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని పేర్కొన్నారు. అక్కడికి వచ్చేసరికే భవనం మొత్తం మంటలు వ్యాపించాయని, వెంటనే సహాయక చర్యలు చేపట్టి మంటలార్పుతూ భవనం లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చామని వెల్లడిం చింది. భవనంలో మొత్తం 16ఫ్లాట్లు ఉన్నాయని, భవనానికి ఎలాంటి ఫైర్‌ సేఫ్టీ, ఫైర్‌ సెట్‌బ్యాక్‌ లేదని తెలిపారు. సెల్లార్‌లో కెమికల్‌ డబ్బాలు స్టోర్‌ చేసిన విషయంపై గతంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నామని తెలిపింది.
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు
ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిని ఎండీ జకీర్‌ హుస్సేన్‌ (66), ఎండీ అజాం (57), రెహ్మాన్‌ సుల్తానా (50), నికత్‌ సుల్తానా (50), తహురా ఫర్హీమ్‌ (35), హజేబుర్‌ రెహ్మాన్‌ (32), ఫైజా సమీనా (26), తరోబా (13), మన్హ (6)గా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రమాద ఘటనపై ముఖ్య మంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహాయం అందిం చడానికి తగు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక అందజేయాల్సిందిగా పోలీసులను గవర్నర్‌ ఆదేశించారు.
సంఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రులు
అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, తలసాని, మేయర్‌ విజయలక్ష్మి, స్థానిక నాయకులు ఫిరోజ్‌ ఖాన్‌, నందకిషోర్‌ వ్యాస్‌, కుమార్‌ గౌడ్‌, విహెచ్‌, తదితరులు సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను పరామర్శించారు. మృతుల కుటంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దీపావళి సందర్భంగా కాల్చిన పటాసుల నిప్పురవ్వలు సెల్లార్‌లో పడి రసాయనాలకు అంటుకుని మంటలు వ్యాపించి ఉంటాయని క్లూస్‌ టీం ప్రాథమికంగా నిర్ధారించినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిన నాంపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాంగ్రెస్‌ వర్సెస్‌ ఎంఐఎం
విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ అభ్యర్థి ఫెరోజ్‌ ఖాన్‌ తన కార్యకర్తలతో కలిసి సంఘటనా స్థలానికి వచ్చారు. పాతబస్తీలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపిం చారు. అప్పటికే అక్కడ ఉన్న ఎంఐఎం కార్యకర్తలు ఫెరోజ్‌ ఖాన్‌ను అడ్డుకోవడంతో ఇరుగ్రూపుల మధ్య తోపులాట జరి గింది. ఎంఐఎం పార్టీ అంటేనే అవినీతి అని, తనను అడ్డు కోవడం ద్వారా ఆ పార్టీ గుండాగిరి చేస్తుందని ఫెరోజ్‌ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఇరువురిపై లాఠీఛార్జ్‌ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.
అధికారుల నిర్లక్ష్యం.. భారీ మూల్యం
నగరంలో వరస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తు న్నాయి. నగరంలో ఏదైనా సంఘటన జరిగిన సమయం లోనే రాజకీయ నాయకులు, అధికారులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత నిమ్మకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపకశాఖ, పోలీసులు, పొల్యూషన్‌ బోర్డుతో పాటు సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండ డంతో నగరంలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నివాస ప్రాంతాల్లో స్క్రాప్‌, కెమికల్‌ గోదాములు ఏర్పాటు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గతేడాది బోయిగూడ నివాసప్రాంతాల్లోని తుక్కుగోదాంలో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 11మంది బీహారీ కూలీలు సజీవ దహనమయ్యారు.
ఈ. సంఘటన మర్చిపోకముందే సికింద్రాబాద్‌లోని రూబీ ఎలక్ట్రిక్‌ బైక్‌ షో రూమ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది సజీవదహనంకాగా, 11మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనపై కేంద్రం ఉన్నతస్థాయి విచారణకు సైతం ఆదేశించింది. నగరంలో నివాస ప్రాంతాల్లోని గోదాంలు, కర్మాగారాలు, ప్రమాదాలకు ఆస్కారంగా ఉన్న ఫ్యాక్టరీలను శివారు ప్రాంతాలకు తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్రమంగా నిర్మించిన సెల్లార్లను కూల్చేస్తామని, సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్‌ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు. కానీ ఆ మేరకు చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా జనావాసాల మధ్య గోడౌన్లు నిర్వహిస్తున్నారు. సెల్లార్‌లో ప్రమాదకరమైన రసాయనాలు నిల్వచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

గవర్నర్‌, సీఎం దిగ్భ్రాంతి
– మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నాంపల్లి బజార్‌ఘాట్‌ అగ్నిప్రమాదలో 9 మంది మృతి చెందిన ఘటనపై, గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటిం చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఘటనపై విచారణ జరిపి వెంటనే నివేదిక అందిం చాలని సీఎస్‌ శాంతి కుమారిని గవర్నర్‌ ఆదేశించారు. కాగా సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఐటీ శాఖ మత్రి కేటీఆర్‌ మతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. అస్వస్థతకు గురైన వారికి ఉస్మానియాలో మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు వెల్లడించారు. పరిస్థితి తీవ్రతను బట్టి అవసరం అయితే ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించనున్నట్టు తెలిపారు. భవనం సెల్లార్‌లో రసాయనాలు నిల్వ ఉంచడం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తెలిసినట్టు పేర్కొన్నారు.
విచారణ జరిపించాలి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నాంపల్లి బజార్‌ఘాట్‌ ప్రమాదంపై విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 9 మంది వ్యక్తుల మృతి తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ లాంటి నగరంలో తరుచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోక పోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రజలు నివసించే ప్రాంతాల్లో రసాయన పదార్థాలు నిలువ చేసే గోదాములను ఉంచకుండా శివారు ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పై ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రేవంత్‌ రెడ్డి విచారం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నాంపల్లి బజార్‌ఘాట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిపోయిందని తెలిపారు. వరస అగ్ని ప్రమాదలు జరుగుతున్నా ప్రభుత్వం నివారణా చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సోమ వారం ఒక బహుళ అంతస్థుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అపార్ట్‌ మెంట్‌ సెల్లార్‌ లో కారు మరమ్మతులు .. రెసిడెన్షియల్‌ ఏరియాలో కెమికల్‌ డ్రమ్ములు ఎలా నిలువ చేశారు..? అని ప్రశ్నించారు. ఈ ఘటన విషయంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. మరణించిన వారికి ప్రగాఢ సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.