– గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
– ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జంట జలశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ ఇన్ ఫ్లో 4000 క్యూసెక్కులుగా ఉంది. 6 గేట్లను 2 అడు గుల మేర ఎత్తిన అధికారులు 4120 క్యూ సెక్కుల నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. హిమా యత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1763.50 అడుగులకు చేరుకుంది. ఇక ఉస్మాన్‌సాగర్ ఇన్ ఫ్లో 2000 క్యూసెక్కులుగా ఉంది. ఉస్మాన్ సాగర్ 6 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి 2080 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1789.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1790 అడుగులకు చేరుకుంది.
హైదరాబాద్ జంట జలాశయాల నుంచి నీరు దిగువకు విడుదల చేయడంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. జియాగూడ వద్ద పురానా పూల్‌ను కలిపే రహదారిపై నీరు చేరింది. దాంతో రహదారిపై రాకపోకలను నిలిపేశారు. ఇదిలా ఉండగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, నాలుగు రోజుల కిందట గాంధీనగర్ నాలాలో గల్లంతైన మహిళ మృతదేహం బుధవారం లభ్యమైంది.